సోషల్‌ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ

Published Sun, May 5 2024 5:00 AM

సోషల్

నల్లగొండ క్రైం : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలపై.. సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ ద్వారా నిఘా పెట్టినట్లు ఎస్పీ చందనాదీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని సంబంధిత రాజకీయ పార్టీలు, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు, ధ్వేష పూరిత ప్రసంగాలు, అసత్య ప్రచారాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో తప్పుడు పోస్టులు పెడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నీట్‌కు అంతా సిద్ధం

రామగిరి(నల్లగొండ) : నీట్‌ – 2024 నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం నల్లగొండలోని ఏడు కేంద్రాల్లో నిర్వహించే పరీక్షకు 2316 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు పాస్‌ పోర్ట్‌సైజ్‌ ఫొటో, ఐడీ కార్డు తీసుకుని పరీక్షకు హాజరుకవాలని నీట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ జి.పార్థసారధి సూచించారు.

8, 9 తేదీల్లో పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ

నల్లగొండ : పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సిబ్బందికి ఈనెల 8, 9 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు విడతలుగా శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణకు పీఓ, ఏపీఓలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.

రైతులకు రూ.517 కోట్లు చెల్లించాం

యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల భాగంగా జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.517 కోట్లు చెల్లించినట్లు అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 370 కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.631 కోట్ల విలువచేసే 2,86,565 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 45,598 మంది రైతుల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 36,928 మంది రైతులకు రూ.517 కోట్లు చెల్లించామని.. మిగతా రూ.117 కోట్లను త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు.

విత్తనాల దుకాణాల్లో తనిఖీలు

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లాలోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు టెక్నికల్‌ ఏఓలు, మండల వ్యవసాయాధికారులు తనిఖీలు చేపట్టారు. స్టాక్‌, విక్రయాలు తదితర విషయాలపై ఆరా తీశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై నిఘా ఏర్పాటు చేయడంతో పాటు వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

సోషల్‌ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
1/1

సోషల్‌ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ

Advertisement
 
Advertisement