పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పక్కాగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పక్కాగా నిర్వహించాలి

Published Sun, May 5 2024 4:40 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పక్కాగా నిర్వహించాలి

ఒంగోలు అర్బన్‌: సాధారణ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించి డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో ఓటింగ్‌ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ఉండటం వల్ల ఓటర్లకు అవసరమైన తాగునీరు, టెంట్లు, కుర్చీలు, హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు తదితర అంశాల్లో ఎటువంటి లోటు లేకుండా చూడాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌, హోమ్‌ ఓటింగ్‌, ఈవీఎంల కమిషనింగ్‌ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో జరుగుతున్నట్లు తెలిపారు. పొరుగు జిల్లాలో ఓటు ఉండి ప్రస్తుతం ప్రకాశంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం జిల్లా కేంద్రంలోని కేంద్రియ విద్యాలయంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఓటు వేసేలా ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారన్నారు. కలెక్టర్‌తో పాటు ఒంగోలు రిటర్నింగ్‌ అధికారి సుబ్బారెడ్డి, ఓఎంసీ కమిషనర్‌ జస్వంతరావు ఉన్నారు.

Advertisement
 
Advertisement