
పన్నీర్‌సెల్వం ప్రభుత్వం ఇంకెన్నాళ్లు?
జయలలితకు అత్యంత ఆప్తురాలైన శశికళకు కీ ఇచ్చిన కీలుబొమ్మలా పన్నీరుసెల్వం నడుచుకున్నా
న్యూఢిల్లీ: ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఓ బలమైన దేశ నాయకులు లేదా ఓ రాష్ట్రనాయకులు మరణిస్తే వెంటనే ఆయన లేదా ఆమెకు సరైన వారసులు, అంటే అంతటి శక్తిసామర్థ్యాలు కలిగిన వ్యక్తి ఎవరన్న ప్రశ్న సహజంగా వస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుని వారి గుండెల్లో అమ్మలా నిలిచిపోయిన జయలలిత మరణించినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న రాక తప్పలేదు. ఆమె స్థానంలో ఆమె వీర విధేయుడు పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా ఈ ప్రశ్నకు ఇంకా తెరపడలేదు.
జయలలితకు అత్యంత ఆప్తురాలైన శశికళకు కీ ఇచ్చిన కీలుబొమ్మలా పన్నీరుసెల్వం నడుచుకున్నా ఏదోరోజు ఆయన కీలు ఊడదీయడం ఖాయం అంటున్నవాళ్లు, మోదీకి సలాం అంటూ గులాంగిరి చేసినంత కాలమే పన్నీర్‌సెల్వం పవర్ నిలబడుతుందనే వాళ్లు, ఏదేమైనా పార్టీని ఏకతాటిపై నడిపించే శక్తిసామర్థ్యాలు శశికళకుగానీ, పన్నీర్‌సెల్వంకుగానీ లేవంటున్న వాళ్లు ఉన్నారు. ఏదో ఒక రోజు అన్నాడీఎంకే రెండుగా చీలిపోతుందని, ఆ చీలిక వర్గంతో కలిసి డీఎంకేగానీ, బీజేపీగానీ లబ్ధి పొందుతుందన్నది అందరి భావన. పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో వారసులు దొరకడం పెద్ద కష్టం కాదు.
ప్రపంచ విశ్లేషణలు ఏం చెబుతున్నాయి?
నిరంకుశంగా కాకపోయినా, అన్నింటికీ తానే అన్న కాస్త అహంకార దృక్పథంతో పాలన సాగించిన జయలలితలాంటి వ్యక్తుల విషయంలో వారసత్వం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. వ్యక్తిగత ఆరాధనను వంటబట్టించుకున్న తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో విజయం సాధించాలంటే జయలలిత లాంటి వైఖరి తప్పదేమో? 1946 నుంచి 2014 సంవత్సరం వరకు ఏకృత్వ పాలన సాగించిన 79 మంది దేశాధినేతల మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలను ప్రపంచ ప్రసిద్థి చెందిన సామాజిక, రాజకీయ విశ్లేషకులు ఆండ్రియా కెండల్ టేలర్, అదే 1945 నుంచి 2000 మధ్య మరణించిన 130 దేశాలకు చెందిన 1118 మంది నాయకుల వారసత్వం ఎంపికను విశ్లేషించిన ప్రొఫెసన్ బెంజామిన్ ఎఫ్ జాన్ వ్యక్తం చేసిన అభిప్రాయల్లో దీనికి సమాధానం దొరకుతుంది.
ఇక్కడ కాస్త నిరంకుశంగా వ్యవహించే నాయకులు ఎలా అధికారంలోకి వచ్చారు? అంటే కుట్రల ద్వారా వచ్చారా లేక ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా వచ్చారా? ఆ తర్వాత వారు సహజంగా మరణించారా? లేక హత్యలకు గురయ్యారా? అన్న అంశాల ఆధారంగా సమాధానం ఉంటుందన్నది వారి అభిప్రాయం.
అధికారం కోసం కొట్టుకోరు...
ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి, సహజంగా మరణించిన నాయకుల వెనక ఉండి అధికారాన్ని అనుభవించిన వాళ్లు, సదరు నాయకుడు చనిపోయాక అధికారం కోసం కొట్టుకోరని, అలాంటి వారు చాలా విషయాల్లో రాజీపడుతూ వెనక ఉండి అధికారాన్ని అనుభవిస్తారని విశ్లేషకులు తేల్చారు. అధికార పీఠాన్ని అధిష్టించడం కన్నా అధికారాన్ని అనుభవించడమే వారికి ముఖ్యమని ఈ విశ్లేషకుల అభిప్రాయం. వారి అభిప్రాయమే నిజమైతే వెనక ఉండి జయలలిత నడిపించినట్లే ఇప్పుడు పన్నీర్ సెల్వంను వెనక ఉండే శశికళ నడిపిస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి, పార్టీ చీలిపోయే పరిస్థితి తీసుకురారు.