Classification of SC
-
సుప్రీం తీర్పుతో మొదలై..
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని స్పష్టం చేస్తూ... ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్గీకరణను మొదటగా తెలంగాణలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఉపసంఘం సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి న్యాయపరమైన చిక్కులు లేకుండా వర్గీకరణ చేపట్టాలంటే ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గతేడాది నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ ప్రత్యేకంగా అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరించడంతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రంగా పలు ప్రాంతాల్లో పర్యటించింది.82 రోజులపాటు అధ్యయనం చేపట్టి మంత్రివర్గ ఉపసంఘానికి ఈ ఏడాది ఫిబ్రవరి 3న నివేదిక అందించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4న అసెంబ్లీ ముందుంచింది. ఆ తర్వాత మళ్లీ కమిషన్ క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించేందుకు మరికొంత సమయం ఇచ్చింది. అనంతరం తుది నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక, అందులోని సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును రూపొందించి మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లును ఈ నెల 9న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు.నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు జారీ చేయనుంది.⇒ ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన, పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–1 కేటగిరీలోకి చేర్చారు. వారి జనాభా ఎస్సీల్లో 3.288 శాతం ఉండటంతో ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–2 కేటగిరీలో చేర్చారు. వారి జనాభా ఎస్సీల్లో 62.748 శాతం ఉండగా 9% రిజర్వేషన్లు కేటాయించారు.మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–3లోకి చేర్చారు. ఎస్సీ జనాభాలో 33.963 శాతం ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.⇒ ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిలో అనుసరించేందుకు గ్రూపులవారీగా రోస్టర్ పాయింట్లు నిర్దేశించారు.⇒ గ్రూప్–1లో నోటిఫై చేసిన, భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్‌లో అంటే గ్రూప్–2లో భర్తీ చేస్తారు. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేస్తారు. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీఫార్వర్డ్ చేస్తారు. -
ఎస్సీల వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కమిషన్ సిఫార్సుల అమలుకు పచ్చజెండా ఊపింది. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్సార్ పేరును తొలగించి తాడిగడప మున్సిపాల్టీగా చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.⇒ చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ⇒ ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు, రూ.37.97 కోట్లతో బుడమేరు డైవర్షన్ చానల్ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి పరిపాలన ఆమోదం.⇒ గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (వీవీఐటీయూ)ని బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతించేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.⇒ సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రుల బృందం సిఫార్సుల ఆమోదానికి సీఆర్డీఏ కమిషనర్‌ను అనుమతిస్తూ నిర్ణయం. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్ 1 బిడ్లను ఆమోదించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్‌కు అధికారం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ తదితర ఆర్ధిక ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఆర్డీఏ ఎండీకి అధికారం.⇒ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.390 కోట్ల విలువైన ఏపీ ట్రాన్స్‌కో 400 కేవీ డీసీ లైన్లు, పీజీసీఐఎల్ 400 కేవీ డీసీ లైన్ల రీ రూటింగ్, బ్యాలెన్స్ పనులకు, రూ.1082.44 కోట్ల విలువైన ఎన్ 10, ఎన్ 13, ఈ 1 జంక్షన్ వరకు యూజీ కేబుల్స్ ద్వారా 22కేవీ హెవీ లైన్ల రీ రూటింగ్ బ్యాలెన్స్ పనులను 8.99 శాతం ఎక్కువకు అప్పగించేందుకు ఆమోదం.⇒ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 4,000 ఎండబ్ల్యూ పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోద ముద్ర.⇒ అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో 1,800 మెగావాట్ల ఆఫ్–స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మెస్సర్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 864.87 ఎకరాల భూమిని కేటాయింపు. కొత్త పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు ఎన్‌హెచ్‌పీసీతో జేవీ ఒప్పందానికి ఆమోదం. ⇒ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం వద్ద ‘ఒబెరాయ్ విలాస్’ రిసార్ట్ అభివృద్ధికి మెస్సర్స్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్‌కు గతంలో కేటాయించిన 50 ఎకరాల భూమి, యాక్సెస్ రోడ్డు రీ ఎలైన్‌మెంట్‌కు ఆమోదం.⇒ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గతేడాది వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రూ.63.73 కోట్లతో నామినేషన్ పద్ధతిలో చేపట్టిన 517 పనుల పరిపాలనా అనుమతులకు ఆమోదం. -
ఇది పరిష్కరించుకోదగిన మిత్రవైరుద్ధ్యం!
భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ప్రతి విషయంలోనూ కులం ప్రధానపాత్ర వహిస్తోంది. కులనిర్మూలన జరగక పోగా కులం వేళ్ళు మరింత బలంగా లోలోతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కుల నిర్మూలనైనా జరగాలి లేదా సంపద, అధికారాల్లో ఎవరి వాటా వారికైనా దక్కాలి. ఇవేవీ జరుగకపోగా వేలసంఖ్యలో విభజింపబడిన పాలిత కులాల మధ్య చెప్పలేనన్ని వైరుద్ధ్యాలు! తమకు దక్కాల్సిన వాటా కోసం ఉమ్మడి పోరాటాలు చేయకుండా తమలో తామే తన్నుకోవడం కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య వైరుద్ధ్యాలే కనిపిస్తున్నాయి. నిజానికివన్నీ మిత్ర వైరుద్ధ్యాలే తప్ప శత్రు వైరుద్ధ్యాలు కావు. వీటిని పరిష్కరించుకోకుండా దశాబ్దాలుగా తగవులాడుకుంటూనే ఉన్నారు.ఎస్సీల్లోని మాల–మాదిగలు, వారి ఉపకులాల మధ్య ఉండాల్సింది మిత్రవైరుద్ధ్యం కాగా అది శత్రువైరుద్ధ్యంగా కొనసాగుతుండడం బాధాకరం. ఇరువురికీ ఆరాధ్యుడు అంబేడ్కర్. ఆయన స్ఫూర్తితో దళిత జాతి విముక్తికై ఉమ్మడి పోరాటాలు చేయకుండా దశాబ్దాలుగా పాత వైరుద్ధ్యాలను మరింత విస్తృతం చేసి దళిత రాజ్యాధికార భావనకు మరింతదూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘దళిత మహాసభ’ దళితులపై జరిగిన పాశవిక దాడులను సమర్థంగా ఎదుర్కొంది. ఎండగట్టింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. అంబేడ్కర్ స్ఫూర్తితో, ఇంగ్లీషు చదువులతో, క్రైస్తవ చైతన్యంతో ఆంధ్ర మాలలు కొంతవరకైనా పాలక స్థాయికెదిగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. రాజకీయ పదవులూ గెలుచుకున్నారు. అలాగే మూడు దశాబ్దాల క్రితం మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ‘మాదిగ దండోరా’ ఉద్యమం చరిత్రాత్మకమైనది. అది మాదిగల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను, అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకునేలా చేసింది. అది కేవలం వర్గీకరణ ఉద్యమంగానే ఉండిపోకుండా వికలాంగుల పెన్షన్, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. కొందరు ఆధిపత్య కులాల వారు తమ పేరు చివర తమ కులాలను తెలియచేసే విశేషాలను పెట్టుకున్నట్లే.. మాదిగలు కూడా తమ పేరు చివర ‘మాదిగ’ పదాన్ని చేర్చుకోవాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు ఆ కులంలో ఆత్మగౌరవాన్ని ప్రోది చేసింది. ఒక్క దళిత కులాల్లోనే కాదు పీడిత కులాలందరికీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందీ దండోరా ఉద్యమం. అయితే దండోరా ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ సాధించడం.కానీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తంగా కొన్నిచోట్ల మాలలు, మరికొన్ని చోట్ల మాది గలు రిజర్వేషన్లలో భాగాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వర్గీకరణ చేస్తే మాల, మాదిగ ఉపకులాలన్నీ రిజర్వేషన్ సౌకర్యాన్ని సమానంగా అనుభవించి అన్ని ఉపకులాలు పైకొస్తాయన్నది వర్గీకరణ కావాలనే వారి వాదం. వర్గీకరణ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదన. ఎక్కడ మాలల్లో గానీ, మాదిగల్లో కానీ చైతన్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఆయా కులాలవారు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారన్నది వాస్తవం.వర్గీకరణ కావాలనడంలో ఎవరి వాటా వారికి చెందాలన్న ప్రజాస్వామిక సూత్రముంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను ఒకసారి చేసినా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల దాని అమలు నిలిపివేయబడింది. అప్పట్నుంచి వైరుద్ధ్యాలు మరీ ఎక్కువయ్యాయి. వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని పాలకపార్టీలు ఓట్లు రాజకీయాలాడటం మొదలు పెట్టాయి. దళితుల ఓట్లు కోసం వర్గీకరణను సమర్థించడం, వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు ఓ ఆటగా మారింది.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!ఈ మధ్యనే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడం సరైన దేనని తీర్పునిచ్చింది. అందులో మెలిక పెట్టింది. క్రీమీలేయర్ పాటించాలని. తరతరాలుగా రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగపరమైన అధికారాలు అనుభవిస్తున్న వారికి లేని క్రీమీలేయర్ దళితుల వర్గీకరణకు కావాలనడం ధర్మ సమ్మతమేనా? కొందరు దళితనేతలు క్రీమీలేయర్ వద్దంటే మరికొందరు వర్గీకరణే వద్దంటున్నారు. మాయావతి లాంటి నాయకురాలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇలాంటి సందర్భాల్లో వర్గీకరణ అమలవుతుందా అనే అనుమానం రావడం సహజమే. అమలు కాకుండా ఉండటానికి వర్గీకరణ వ్యతిరేకులు, అమలు చేయడానికి వర్గీకరణ అనుకూలురు ఇంకా ఎన్నేండ్లు పోరాటాలు చేస్తూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని మరిచిపోతారు?దళిత సోదర సోదరీమణులు తమ మధ్యనున్న వైరుధ్యాలను మిత్ర వైరుద్ధ్యాలుగా భావించి చర్చలతో వర్గీకరణ సమస్య విషయంలో ఏకీభావానికి వచ్చి దళిత రాజ్యాధికార భావనను సాకారం చేసే దిశగా పయనం కొనసాగిస్తే మంచిది. తమ అంతిమ లక్ష్యం దళిత సాధికారత, రాజ్యాధికారం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇరువైపుల వారికీ వర్గీకరణ సమస్య అతి చిన్నదిగా కనబడుతుంది.- డాక్టర్ కాలువ మల్లయ్యప్రముఖ కథా రచయిత -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
హన్మకొండ : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబయ్య డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కోరుతూ హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే దీక్షలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 27వరకు దీక్షలు కొనసాగుతాయని తెలి పారు. గత పాలకులు ఇచ్చిన మాట నిలుపుకోకపోవడం వల్లే మాదిగల ఉసురు తాకి అధికారానికి దూరమయ్యారని, వర్గీకరణ చేపట్టకపోతే బీజేపీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. దీక్షలో ఎమ్మార్పీఎస్(టీఎస్) నాయకులు మాదాసి రాంబాబు, పి.సంజీవ, మంద బాబురావు, ఆకులపల్లి బాబు, తాళ్ళ విజయ్, నమిండ్ల చిన్న స్వామి, తాళ్లపల్లి మధు. అర్షం అశోక్, చింత జోసఫ్, సారంగం, కాయిత ప్రసాద్, కట్కూరి కిశోర్ కూర్చున్నారు. -
కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే జరగని ఎస్సీ వర్గీకరణ
టీడీపీ ప్రభుత్వంలోనైనా చట్టబద్ధత కల్పించాలి నిర్లక్ష్యం చేస్తే మహా సంగ్రామం తప్పదు మందక్రిష్ణ మాదిగ మదనపల్లె: రాష్ట్రంలో, కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కాం గ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్సీ వర్గీకరణ జరగలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందక్రిష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం బుధవారం మదనపల్లెలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించాయని, మొన్న జరిగిన ఎన్నిక ల్లో కూడా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టాయన్నారు. వాటికనుగుణంగా వెంటనే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఈ ప్రభుత్వాలు కూడా మాదిగలను విస్మరిస్తే మరో మెరుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టా ల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇందులో భాగంగానే మాదిగ ఉపకులాల ప్రజలను ఉద్యమాలకు అప్రమత్తం చేసేందుకు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నామని తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి మాదిగ శ్రేణుల ను సమాయత్తం చేస్తామన్నారు. రాష్ట్రస్థాయి కమిటీలతో పాటు జిల్లా, మం డల, గ్రామ కమిటీలను ఎంపిక చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్నారు. ప్రభుత్వా లు తమ మాట నిలబెట్టుకుని అన్యాయమైపోతున్న ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని మందక్రిష్ణ కోరా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు, ఎఇ ఎఫ్ రాష్ట్ర నాయకులు మంచూరి మా రప్ప, రాష్ట్ర నాయకులు పిల్లి మాణిక్యరావు, గిరిజన నాయకులు దివాకర్, యువసేన అధ్యక్షులు గౌతమ్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు. -
మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తీగల రత్నం నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణతోపాటు వికలాంగుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తున్న మంద కృష్ణమాదిగపై సొంత సంఘం నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తీగల రత్నంమాదిగ హితవు పలికారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సంఘం నుంచి సస్పెండై స్వార్థం కోసం తిరిగి చేరిన వ్యక్తులు మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే చర్యలకు పాల్పడవద్దని, మంద కృష్ణను అవమానపర్చితే యావత్ మాదిగజాతిని అవమానపర్చినట్లు అవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైన ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి కనకరాజు సామ్యేలు మాట్లాడుతూ మంద కృష్ణమాదగ గురించి యావత్ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఉద్యమకారుడిపై ఆరోపణలు చేస్తే జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. వారివెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బకరం శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమిరె స్వామి, శివశంకర్ తదితరులు ఉన్నారు.