
గతేడాది ఆగస్టు 1 నుంచి నేటి దాకా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ప్రస్థానం ఇదీ..
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని స్పష్టం చేస్తూ... ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్గీకరణను మొదటగా తెలంగాణలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఉపసంఘం సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి న్యాయపరమైన చిక్కులు లేకుండా వర్గీకరణ చేపట్టాలంటే ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గతేడాది నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ ప్రత్యేకంగా అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరించడంతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రంగా పలు ప్రాంతాల్లో పర్యటించింది.
82 రోజులపాటు అధ్యయనం చేపట్టి మంత్రివర్గ ఉపసంఘానికి ఈ ఏడాది ఫిబ్రవరి 3న నివేదిక అందించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4న అసెంబ్లీ ముందుంచింది. ఆ తర్వాత మళ్లీ కమిషన్ క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించేందుకు మరికొంత సమయం ఇచ్చింది. అనంతరం తుది నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక, అందులోని సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును రూపొందించి మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లును ఈ నెల 9న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు జారీ చేయనుంది.
⇒ ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన, పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–1 కేటగిరీలోకి చేర్చారు. వారి జనాభా ఎస్సీల్లో 3.288 శాతం ఉండటంతో ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–2 కేటగిరీలో చేర్చారు. వారి జనాభా ఎస్సీల్లో 62.748 శాతం ఉండగా 9% రిజర్వేషన్లు కేటాయించారు.మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–3లోకి చేర్చారు. ఎస్సీ జనాభాలో 33.963 శాతం ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
⇒ ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిలో అనుసరించేందుకు గ్రూపులవారీగా రోస్టర్ పాయింట్లు నిర్దేశించారు.
⇒ గ్రూప్–1లో నోటిఫై చేసిన, భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్‌లో అంటే గ్రూప్–2లో భర్తీ చేస్తారు. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేస్తారు. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీఫార్వర్డ్ చేస్తారు.