
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు
వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కమిషన్ సిఫార్సుల అమలుకు పచ్చజెండా ఊపింది. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్సార్ పేరును తొలగించి తాడిగడప మున్సిపాల్టీగా చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
⇒ చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
⇒ ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు, రూ.37.97 కోట్లతో బుడమేరు డైవర్షన్ చానల్ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి పరిపాలన ఆమోదం.
⇒ గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (వీవీఐటీయూ)ని బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతించేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
⇒ సీఆర్‌డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రుల బృందం సిఫార్సుల ఆమోదానికి సీఆర్‌డీఏ కమిషనర్‌ను అనుమతిస్తూ నిర్ణయం. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్ 1 బిడ్లను ఆమోదించడానికి ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ తదితర ఆర్ధిక ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఆర్‌డీఏ ఎండీకి అధికారం.
⇒ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.390 కోట్ల విలువైన ఏపీ ట్రాన్స్‌కో 400 కేవీ డీసీ లైన్లు, పీజీసీఐఎల్ 400 కేవీ డీసీ లైన్ల రీ రూటింగ్, బ్యాలెన్స్ పనులకు, రూ.1082.44 కోట్ల విలువైన ఎన్ 10, ఎన్ 13, ఈ 1 జంక్షన్ వరకు యూజీ కేబుల్స్ ద్వారా 22కేవీ హెవీ లైన్ల రీ రూటింగ్ బ్యాలెన్స్ పనులను 8.99 శాతం ఎక్కువకు అప్పగించేందుకు ఆమోదం.
⇒ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 4,000 ఎండబ్ల్యూ పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోద ముద్ర.
⇒ అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల్లో 1,800 మెగావాట్ల ఆఫ్–స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మెస్సర్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 864.87 ఎకరాల భూమిని కేటాయింపు. కొత్త పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు ఎన్‌హెచ్‌పీసీతో జేవీ ఒప్పందానికి ఆమోదం.
⇒ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం వద్ద ‘ఒబెరాయ్ విలాస్’ రిసార్ట్ అభివృద్ధికి మెస్సర్స్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్‌కు గతంలో కేటాయించిన 50 ఎకరాల భూమి, యాక్సెస్ రోడ్డు రీ ఎలైన్‌మెంట్‌కు ఆమోదం.
⇒ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గతేడాది వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రూ.63.73 కోట్లతో నామినేషన్ పద్ధతిలో చేపట్టిన 517 పనుల పరిపాలనా అనుమతులకు ఆమోదం.
Comments
Please login to add a commentAdd a comment