commandant
-
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: ‘లే నాన్న.. అమ్మా.. చెల్లి వచ్చాం.. ఒక్కసారి చూడండి నాన్న.. మీరే మా ధైర్యం.. ఇలా వెళ్లి పోతే ఎలా.. మీకు ఎన్ని గాయాలు అయ్యాయి.. నాన్న పడిపోతుంటే.. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు..!! అంటూ.. సిరిసిల్లలో ప్రమాదవ శాత్తు మృతిచెందిన 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం(61)(Police Commandant Gangaram) కూతురు డాక్టర్ గౌతమి కన్నీరు కార్చుతూ విలవిలాడిపోయారు. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావునగర్‌లో రమేశ్ ఇంట్లో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అద్దెకు ఉంటారు. చంద్రశేఖర్‌రెడ్డి కూతురు ఇటీవల మరణించారు. అతన్ని ఓదార్చేందుకు వారి ఇంటికి వెళ్లిన తోట గంగారాం తిరిగి వస్తుండగా.. లోపల లిఫ్ట్ లేకుండానే గేటు ఓపెన్ కావడంతో అందులో ప్రమాదశాత్తు పడిపోయాడు. మూడో అంతస్తు నుంచి గంగారాం పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తాళ్ల సాయంతో గంగారాంను బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఫ్ట్ నిర్వహణ లోపమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేటకు చెందిన లిఫ్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పోలీస్ బెటాలియన్‌లో..సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ మృతదేహాన్ని ఉంచి పలువురు నివాళులు అర్పించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బెటాలియన్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు రాత్రి ఎస్పీ గిటే మహేశ్ బాబా సాహేబ్, ఏఎస్పీ చంద్రయ్య గంగారాం మృతదేహాన్ని పరిశీలించి నివాలి అర్పించారు. గతంలో హైదరాబాద్ సచివాలయం ఛీప్ సెక్యూరిటీ ఆఫీస్(సీఎస్‌వో) గా గంగారాం పని చేశారని, ఆయన మృతిపట్ల సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ పోలీస్ కమాండెంట్ మృతిపై సంతాపం ప్రకటించారు. బెటాలియన్ పోలీస్ సిబ్బంది కన్నీటి నివాళి మధ్య గంగారాం మృతదేహాన్ని స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులంకు తరలించారు. -
లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి
రాజన్న: తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 17 బెటాలియన్ కమాండెంట్ గా పనిచేస్తున్న గంగారం మరణించడం జరిగింది. నిన్న ఓ అపార్ట్మెంట్లో డిన్నర్ కు వెళ్లాడు గంగారం. ఈ తరుణంలోనే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశాడు గంగారం.అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో.. కమాండెంట్ గంగారం పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు గంగారం. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గంట తర్వాత ప్రకటించారు వైద్యులు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేటీఆర్ సంతాపంతెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సంతాపం తెలియజేశారు. గంగారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పోలీసు శాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం ప్రమాదవశాత్తు జరిగిన లిప్టు ప్రమాదంలో మరణించడం బాధాకరమని అన్నారాయన. -
ఎవరీ పూనమ్ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి..!
వివాహం మనకు నచ్చిన చోటు లేదా విదేశాల్లో చేసుకుంటారు. ఇంకాస్త బడా బాబులైతే లగ్జరీయస్ హోటల్స్ లేదా ప్యాలెస్‌లలో చేసుకుంటారు. కానీ ఇలా ఏకంగా రాష్ట్రపతిలో భవన్లో వివాహంలో జరగడం గురించి విన్నారా..!. ఔను సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా ఆ లక్కీఛాన్స్ కొట్టేసింది. ఇలా భారతదేశ రాష్ట్రపతి భవన్లో జరుగనున్న తొలి పెళ్లి ఇదే కావడం విశేషం. అసలు ఆ అధికారిణికి ఇలాంటి అవకాశం ఎలా దక్కింది? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలా అనుమతించారు తదితరాల గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..!.భారతదేశ అత్యున్నత శక్తికి కేంద్రబిందువు రాష్ట్రపతి భవనం(Rashtrapati Bhavan). అలాంటి అత్యున్నత గౌరవనీయ ప్రదేశంలో సీఆర్పీఎఫ్ అధికారిణి వివాహం ఫిబ్రవరి 12, 2025న రాష్ట్రపతి భవన్లో జరగనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. భారతదేశ రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే రెండొవ అదిపెద్ద నివాసం. దీన్ని సర్ ఎడ్విన్ లుటియెన్స్ రూపొందించారు. దీన్ని దాదాపు 300 ఎకరాల ఎస్టేట్‌లో నిర్మించారు. రాష్ట్రపతి భవన్లో మొత్తం నాలుగు అంతస్తులు, 340 గదులు ఉంటాయి. దీనితోపాటు అమృత్ ఉద్యాన్, మ్యూజియం, గణతంత్ర మండపం, అశోక మండపం, రాగి ముఖం గల గోపురం కూడా ఉన్నాయి. అంతేగాదు 1948 స్వతంత్ర భారతదేశంలో తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఈ రాష్ట్రపతి భవన్లో నివశించిన తొలి భారతీయుడు. అలా ఎందరో రాష్ట్రపతులు ఈ భవన్లో నివశించారు. అలాగే ఎందరో ఉన్నతస్థాయి ప్రముఖులు ఇందులో ఆతిథ్యం పొందారు. అలాంటి ఘన చరిత్ర గలిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్లో సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా(Poonam Gupta) వివాహం జరగనుండటానికి గల కారణం ఏంటంటే..అనుమతి ఎలా లభించిందంటే..సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓగా నియమితులయ్యారు. ఆమె 74వ గణతంత్ర దినోత్సవం పరేడ్(74th Republic Day Parade)లో పూర్తిగా మహిళా బృందానికి నాయకత్వం వహించింది. అలాగే పూనమ్ వృత్తిపరంగా నిబద్ధతగా, అంకితభావంతో పనిచేసే ప్రవర్త నియమావళే ఆ అదృష్టాన్ని పొందేలా చేసింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు అనుమతిచ్చారు. దీంతో పూనమ్ ఇలా రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకున్న తొలిగా వ్యక్తి చరిత్ర సృష్టించనుంది. పూనమ్ గుప్తా ఎవరంటే..సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్(CRPF Assistant Commandant) పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన మహిళ. ఆమె 2018 యూపీఎస్సీ, సీఆర్పీఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణురాలై 81వ ర్యాంకుని సాధించింది. ఆ తర్వాత ఆమె సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టింది. అలా బీహార్‌లోని నక్సల్స్ ప్రభావిత జోన్లో కూడా పనిచేశారు. అక్కడ ఆమె కనబర్చిన ధైర్య సాహసాలు అసామాన్యమైనవి. ఇక ఆమె కాబోయే భర్త అవినాష్ కుమార్ కూడా సీఆర్ఎఫ్ కమాండెంట్. ప్రస్తుతం అతడు జమ్ము కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల(ఫిబ్రవరి 12, 20205న) రాష్ట్రపతి భవన్‌లోని ఆ జంట వివాహం మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో జరగనుంది. ఈ వివాహానికి ఇరువురి దగ్గరి కుటుంబ సభ్యలు మాత్రమే హాజరవుతారు. ఇలా రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకునే అదృష్టం దక్కిన ఆ అధికారిణికి శుభాకాంక్షలు చెబుదామా..!.(చదవండి: బట్టతల అందమే..! చూసే విధానంలోనే ఉందంతా..) -
ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్‌గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ
వెంగళరావునగర్: యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్‌గా పి.మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఏకే మిశ్రా బదిలీపై వెళ్లారు. కొండాపూర్‌లోని 8వ పటాలంలో విధులు నిర్వహించే మురళీకృష్ణను ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్‌గా నియమించారు. మురళీకృష్ణకు ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. పటాలం సిబ్బంది చేసిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ బెటాలియన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజాసేవలో తమవంతు బాధ్యతలు నెరవేర్చడంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది ముందుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ సత్యనారాయణ, రంగారెడ్డి, జవహర్లాల్, నరసింహ, ఆర్ఐలు సురేష్, ధర్మారావు, సాంబయ్య, శంకర్, జాఫర్, రవీందర్, రాజేశం, ఆర్ఎస్ఐలు, ఇతర ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉన్నతాధికారులపై దాడి చేసిన ట్రైనీ కానిస్టేబుళ్లు
పాట్నా : లా అండ్ ఆర్డర్‌ని కాపాడాల్సిన పోలీసులే.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమ సహోద్యోగి మృతికి కారణమయిన ఓ కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను చితక్కొట్టడమే కాకా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ట్రైనింగ్‌లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌కి డెంగ్యూ వచ్చింది. దాంతో సదరు మహిళ సెలవు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. కానీ వారు అంగీకరించలేదు. దాంతో ఆ మహిళా కానిస్టేబుల్ మరణించింది. సెలవు మంజూరు చేయకపోవడం వల్లే సదరు ఉద్యోగిని మరణించిందని తేలిసి ఆగ్రహం చెందిన మిగతా ట్రైనీ కానిస్టేబుళ్లు కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారుల మీద దాడికి దిగారు. అసభ్య పదజాలంతో తిడుతూ.. పదునైన ఆయుధాలతో దాడి చేయడమే కాకా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అంతటితో ఊరుకోక కొన్ని ప్రభుత్వ వాహనాలతో పాటు ఫర్నిచర్‌ని కూడా ధ్వంసం చేశారు. Patna: Police personnel protest and create ruckus allegedly after an ailing woman constable passed away due to lack of treatment.Protesters claim the commandant did not grant her an adequate leave period to get treated.The commandant was injured after being thrashed by protesters pic.twitter.com/GtJbgN1owL — ANI (@ANI) November 2, 2018 ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో బిహార్ సీఎం నితిష్ కుమార్ దృష్టికి చేరింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా నితిష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నాలుగేళ్ల కూతురిపై అత్యాచారం
బనశంకరి: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన నీచ ఘటన గదగ్ జిల్లాలోని శివహట్టి తాలూకాలో చోటుచేసుకుంది. శివహట్టికి చెందిన కామాంధుడు మలసంది తన నాలుగేళ్ల కుమార్తెపై రెండు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆస్పత్రికి తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది. భర్తే ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు తెల్సినా భార్య అతని పేరు బయటకు చెప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని, బాధితురాలిని తమదైన శైలిలో విచారణ చేయడంతో ఆమె అసలు విషయం వెల్లడించింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చేపట్టారు. -
రెండవ పటాలం పేరు నిలబెట్టండి
– తెలంగాణకు రెండవ పటాలం నుంచి కానిస్టేబుళ్లు బదిలీ కర్నూలు: ఎక్కడ పనిచేసినా ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం పేరు నిలబెట్టాలని కమాండెంట్ శామ్యూల్ జాన్ కానిస్టేబుళ్లకు సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఏపీఎస్పీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా మంచిర్యాల, బీచ్పల్లి బెటాలియన్లకు వారు అలాట్ అయ్యారు. బుధవారం సాయంత్రం కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలంలో సహోద్యోగులు వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమాండెంట్ శామ్యూల్ జాన్ మాట్లాడుతూ ఎక్కడ విధులు నిర్వహించినా ఎంపికైన బెటాలియన్‌కు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్, డీఎస్పీ ఎన్.వి.ఎస్.మూర్తి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు. -
2వ పటాలం కమాండెంట్‌గా శామ్యూల్ జాన్
- విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి కర్నూలు : ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం కమాండెంట్ విజయ్‌కుమార్ స్థానంలో సీహెచ్ శామ్యూల్‌జాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గుంటూరుకు చెందిన ఈయన 1982లో ఆర్ఎస్ఐ హోదాలో ఏపీఎస్పీ విభాగంలో చేరారు. వరంగల్, కాకినాడ, మంగళగిరి బెటాలియన్లలో పని చేశారు. 1988లో ఆర్ఐగా, 2004లో అసిస్టెంట్ కమాండెంట్‌గా, 2011లో అడిషనల్ కమాండెంట్‌గా పదోన్నతి పొందారు. కర్నూలు రెండవ పటాలంలో విధులు నిర్వహిస్తూ 2013లో పదోన్నతిపై 11వ బెటాలియన్ కడప జిల్లాకు కమాండెంట్‌గా బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లపాటు విధులు నిర్వహించారు. ఈ నెల 1వ తేదీన కర్నూలు రెండవ పటాలం కమాండెంట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. డీఐజీగా విజయ్‌కుమార్ : ఏపీఎస్పీ రెండవ పటాలం కమాండెంట్‌గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్స్ మూడవ రేంజ్ (కర్నూలు, కడప, అనంతపురం) డీఐజీగా ఉన్న ప్రసాద్‌బాబు డిసెంబర్లో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో విజయ్‌కుమార్ నియమితులయ్యారు. 2013 నుంచి ఈయన కర్నూలు ఏపీఎస్పీ రెండవ కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విజయ్‌కుమార్ ఈ నెల 18వ తేదీన మూడవ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. -
కేంద్ర సాయుధ దళాల్లో కొలువుల మేళా
దేశ రక్షణ వ్యవస్థలో గ్రూప్-ఏ కేడర్ పోలీస్ అధికారిగా ప్రస్థానం ప్రారంభించాలనుకునే వారికి చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు కేంద్ర సాయుధ పోలీసు దళం (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్)లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ తర్వాత స్థానం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులదే. హోదాతో పాటు ఆకర్షణీయమైన వేతనం, అద్భుతమైన కెరీర్‌కు బాసటగా నిలిచే.. అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్ విధానం, ప్రిపరేషన్, తదితర వివరాలు.. కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్-ఎ హోదాతో సరితూగే అసిస్టెంట్ కమాండెంట్ కొలువుల నియామకానికి యూపీఎస్సీ సిద్ధమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమాబల్... ఇలా అన్ని విభాగాల్లోనూ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లోని.. మూడు దళా ల్లో మొత్తం 136 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. దళాల వారీగా ఖాళీల వివరాలు.. దళం ఖాళీలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 68 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 28 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 40 మొత్తం ఖాళీలు 136 పై పోస్టులకు పురుషులతోపాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి.. 1. రాత పరీక్ష 2. దేహ దారుఢ్య-వైద్య పరీక్ష 3. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య-వైద్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు చివరగా ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి. ఈ మూడు అంశాల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్-250 మార్కులు పేపర్ 2: జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్- 200 మార్కులు పేపర్-1: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఆంగ్లం, హిందీ మాధ్యమంలో ప్రశ్నలను అడుగుతారు. పేపర్-2: వ్యాసరూప ప్రశ్నల విభాగాన్ని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో రాసుకోవచ్చు. కానీ ఇతర భాగాలైన కాంప్రహెన్షన్, ప్రెసీస్రైటింగ్, కమ్యూనికే షన్ స్కిల్స్ అంశాలను ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. రెండు పేపర్లకూ ఒకే రోజు ఉదయం, మధ్యా హ్నం పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ అంశాల్లో 200 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రతీ పేపర్లో నిర్దేశించిన విధంగా అర్హత మార్కులు సాధించాలి. పేపర్-1లో అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్-2ను మూల్యాంకనం చేస్తారు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు 1/3 మార్కుల కోత విధిస్తారు. పరీక్షకు సన్నద్ధమిలా పేపర్-1: ఇందులో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియా-వరల్డ్ జాగ్రఫీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్: అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యుమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. సిరీస్, క్లాసిఫికేషన్స్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, దూరం-కాలం, లాభ-నష్టాలు, పై చార్ట్‌లు, గ్రాఫ్‌లు, టేబుల్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. ఈ విభాగంలో రాణించేందుకు ఇంగ్లిష్ అక్షర క్రమంలోని అక్షరాల స్థానాలను ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు పుక్కిట పట్టాలి, ఎక్కాలు, వర్గాలు, ఘనాల విలువలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు వంటి ప్రక్రియలపై పట్టు సాధించాలి. జనరల్ సైన్స్: ఇందులో దైనందిన జీవితంలో ఎదురవుతున్న వివిధ సైన్స్ అంశాల్లో అభ్యర్థికున్న జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇటీవల జరుగుతున్న తాజా పరిణామాలు ముఖ్యంగా పర్యావరణం, జీవ సాంకేతికశాస్త్రం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అనువర్తనాలు, తదితర అంశాలకు సంబంధించి ప్రాథమిక స్థాయి భావనల ప్రశ్నలను అడుగుతారు. కరెంట్ ఈవెంట్స్: ఇందుకోసం గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనించాలి. కళలు, సంగీతం, సాహిత్యం, క్రీడల్లో అవార్డులు పొందిన వారి గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. వివిధ దేశాల మధ్య జరిగిన ముఖ్య ఒప్పందాలు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విదేశాలతో భారత్ ఏర్పర్చుకున్న వ్యాపార, సాంఘిక, వ్యూహాత్మక ఒప్పందాల గురించి తెలుసుకోవాలి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ: దేశ రాజకీయ, ఆర్థిక విధానంపై అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు వస్తాయి. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, దాని నిర్మాణం, అందులోని ప్రకరణలు, సవరణలు, పార్లమెంట్, హైకోర్టు, సుప్రీంకోర్టు, పరిపాలన వ్యవస్థ, రాష్ర్టపతి, గవర్నర్ల అధికారాలు, భద్రతాంశాలు, పోలీస్ చట్టాలు, మానవ హక్కులు, ఆర్థికంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, రిజర్వ్ బ్యాంక్ పాత్ర, దాని విధాన నిర్ణయాలు, విదేశీ పెట్టుబడులు, ఆర్థిక వేత్తలు - సిద్ధాంతాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. భారత చరిత్ర: సింధు నాగరికత, భారత్‌ను పాలించిన రాజ వంశాలు, చక్రవర్తులు, ఆనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, భారత స్వాతంత్య్ర పోరాటం, బ్రిటిష్ పాలన, తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇండియా-వరల్డ్ జాగ్రఫి: ఇందులో భారత్, ప్రపంచ భౌగోళిక పరిస్థితులపై అవగాహనను పరీక్షించే ప్రశ్నలను అడుగుతారు. ఈ క్రమంలో నదులు, సముద్రాలు, వివిధ శీతోష్ణస్థితులు, అడవులు, ఖనిజాలు, పర్వతాలు, శిఖరాలు, విశ్వం, తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పేపర్-2: ఈ పేపర్.. పార్ట్-ఏ, బీ అనే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ: ఇందులో నిర్దేశించిన అంశంపై ఒక వ్యాసం రాయాలి. దీనికి 80మార్కులు. భారత స్వాతంత్య్ర పోరా టం, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ, దేశ భద్రతకు సంబంధించిన చట్టాలు, వ్యవస్థలు, మానవ హక్కులు వంటి అంశాలకు సంబంధించి వ్యాసం అడిగే అవకాశం ఉంది. ఈ విభాగంలో రాణించడానికి రోజుకో అంశాన్ని ఎంచుకొని వ్యాసం రాయడాన్ని బాగా సాధన చేయాలి. ప్రశ్నలో దేని గురించి అడిగారో గమనించి ఆ అంశంలో తెలిసినదంతా కాకుండా అడిగిన మేరకే రాయాలి. వాటికి సంబంధించి నిపుణుల నిర్వచనాలు, గణాంకాలను పేర్కొంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ అంశంలో తాజా పరిణామాలు ఏమైనా ఉంటే వాటి గురించి ప్రస్తావిస్తే ఎస్సే సంపూర్ణమవుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు ఎస్సే కోసం ప్రిపరేషన్లో అదనపు సమయం వెచ్చించాలి. ఇంగ్లిష్ పదజాలంపై, వాక్య నిర్మాణ శైలిపై పట్టు సాధించాలి. ఈ విభాగాన్ని ఇంగ్లిష్ లేదా హిందీ భాషల్లో రాయొచ్చు. పార్ట్-బీ: ఈ పేపర్‌కు 120 మార్కులు కేటాయించారు. ఇందులో కాంప్రహెన్షన్, ప్రెసీస్ రైటింగ్, గ్రామర్.. ఇలా ఇంగ్లిష్ ప్రావీణ్యానికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం కోసం ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకం చదివితే మంచిది. రోజూ ప్రెసీస్ రైటింగ్, కాంప్రహెన్షన్ సాధన చేస్తూ గ్రామర్ (సినానిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్స్, టెన్సెస్, తదితరాలు) గురించి చదువుకోవాలి. ఈ విభాగంలో మాత్రం ఇంగ్లిష్‌లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్ ఇలా: రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇందులో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనే రెండు అంశాలు ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో.. అభ్యర్థులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలను పరీక్షిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని మాత్రమే తర్వాతి దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు అనుమతిస్తారు. ఇందులో వివిధ రకాల ఫిజికల్ ఈవెంట్లు ఉంటాయి. అవి.. ఈవెంట్ పురుషులు మహిళలు 100 మీ. పరుగు 16 సెకన్లు 18 సెకన్లు 800 మీ. పరుగు 3 ని. 45 సె. 4 ని. 45 సె. లాంగ్ జంప్ 3.5 మీ. 3 మీ. (మూడు ప్రయత్నాలు) షాట్ పుట్(7.26 కిలోలు) 4.5 మీ. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్‌లోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 150 మార్కులు కేటాయించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్‌కు ఇలా పరీక్ష తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చనే ధోరణిలో ఎక్కువ మంది ఉంటారు. కానీ పరీక్షతోపాటు ఫిజికల్ టెస్ట్‌కు ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఇదివరకు ఎలాంటి అనుభవం లేని వాళ్లు పరీక్ష నాటికి మూడు నెలల ముందు నుంచి సాధన చేయడం ఉత్తమం. ప్రస్తుత వేసవి తరుణంలో ఉదయం 5 గం. నుంచి 7 గం., అలాగే సాయంత్రం 5.30 తర్వాత ప్రాక్టీస్ చేయడం శ్రేయస్కరం. నెల రోజుల తర్వాత ఎంత సమయంలో పరుగెత్తుతున్నారో చూసుకోవాలి. వీలైనంత వరకు మైదాన ప్రాంతాలనే ఎంచుకోవాలి. లేదంటే యాంకిల్, మోకాలిపై ఒత్తిడి పడుతుంది. కొత్తగా సాధన చేస్తున్నవాళ్లు మొదటి రోజు నుంచే నిర్దేశిత సమయంలో పరుగెత్తాలనుకోవడం పొరపాటు. దీనివల్ల అలసటకు గురవుతారు. శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. నీళ్లు బాగా తాగాలి. షాట్‌పుట్, లాంగ్ జంప్‌కు మాత్రం వారం రోజుల పాటు శిక్షకుల సలహాలను తీసుకుంటే మంచిది. లాంగ్‌జంప్ కోసం చదునైన ఇసుక నేలను ఎంచుకోవాలి. లాంగ్ జంప్ చేసేటపుడు రెండు పాదాలు ఒకే చోట పడేలా చూసుకోవాలి. లేదంటే యాంకిల్ ట్విస్ట్ వస్తుంది. షూస్ తప్పనిసరిగా ధరించాలి. ఇవన్నీ సులువైన లక్ష్యాలే అయినప్పటికీ స్వల్ప జాగ్రత్తలు పాటించాలి. పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ సాధన చేసే సమయంలో ఎలాంటి చిన్న నొప్పులు వచ్చినా అశ్రద్ధ చేయకుండా తక్షణమే వైద్యుణ్ని సంప్రదించాలి. డాక్టర్ సుధీర్, ఆర్థోపెడిక్ యం.ఎస్., అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, శ్రీకాకుళం. ఇవి చదివితే మేలు ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల గణితం, సైన్స్, సాంఘికశాస్త్రాల పుస్తకాలు ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల చరిత్ర, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం -ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్, రీజనింగ్ బుక్స్ (చాంద్ పబ్లికేషన్స్) మనోరమ ఇయర్ బుక్ రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ (నార్మన్ లూయీస్) జనరల్ అవేర్నెస్-ప్రతియోగితా దర్పణ్ నోటిఫికేషన్ సమాచారం విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు. మహిళలు 165 సెం.మీ, 157 సెం.మీ. బరువు: పురుషులు మహిళలు 50 కిలోలు, 46 కిలోలు (నిర్దేశించిన విధంగా ఎత్తుకు తగ్గ బరువు). ఛాతీ: 81సెం.మీ.(గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి, పురుషులకు మాత్రమే). స్పష్టమైన కంటి చూపు తప్పనిసరి. వయోపరిమితి: ఆగస్ట్ 1, 2014 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో సడలింపు) రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం దరఖాస్తు ఫీజు: రూ. 200 (ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు) దరఖాస్తు విధానం: www.upsconline.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 12, 2014. పరీక్ష తేదీ: జూలై 13, 2014 వెబ్సైట్: www.upsc.gov.in