కేంద్ర సాయుధ దళాల్లో కొలువుల మేళా | Assistant Commandant issued for applications | Sakshi
Sakshi News home page

కేంద్ర సాయుధ దళాల్లో కొలువుల మేళా

Published Thu, Apr 17 2014 3:26 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

కేంద్ర సాయుధ దళాల్లో కొలువుల మేళా - Sakshi

కేంద్ర సాయుధ దళాల్లో కొలువుల మేళా

దేశ రక్షణ వ్యవస్థలో గ్రూప్-ఏ కేడర్ పోలీస్  అధికారిగా ప్రస్థానం ప్రారంభించాలనుకునే వారికి చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు కేంద్ర సాయుధ పోలీసు దళం (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్)లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ తర్వాత స్థానం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులదే. హోదాతో పాటు ఆకర్షణీయమైన వేతనం, అద్భుతమైన కెరీర్‌కు బాసటగా నిలిచే.. అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్ విధానం,

 ప్రిపరేషన్, తదితర వివరాలు..
  కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్-ఎ హోదాతో సరితూగే అసిస్టెంట్ కమాండెంట్ కొలువుల నియామకానికి యూపీఎస్సీ సిద్ధమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమాబల్... ఇలా అన్ని విభాగాల్లోనూ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లోని.. మూడు దళా ల్లో మొత్తం 136 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. దళాల వారీగా ఖాళీల వివరాలు..
 
 దళం    ఖాళీలు
 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)    68
 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)    28
 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
 (సీఐఎస్‌ఎఫ్)    40
 మొత్తం ఖాళీలు    136
 పై పోస్టులకు పురుషులతోపాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 ఎంపిక విధానం:
 ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి..
 1. రాత పరీక్ష
 2. దేహ దారుఢ్య-వైద్య పరీక్ష
 3. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్.
 రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య-వైద్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు చివరగా ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి. ఈ మూడు అంశాల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
 
 రాత పరీక్ష:
 ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
     పేపర్-1: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్-250 మార్కులు
     పేపర్ 2: జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్- 200 మార్కులు
 పేపర్-1: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఆంగ్లం, హిందీ మాధ్యమంలో ప్రశ్నలను అడుగుతారు.
 
 పేపర్-2: వ్యాసరూప ప్రశ్నల విభాగాన్ని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో రాసుకోవచ్చు. కానీ ఇతర భాగాలైన కాంప్రహెన్షన్, ప్రెసీస్‌రైటింగ్, కమ్యూనికే షన్ స్కిల్స్ అంశాలను ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. రెండు పేపర్లకూ ఒకే రోజు ఉదయం, మధ్యా హ్నం పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ అంశాల్లో 200 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రతీ పేపర్‌లో నిర్దేశించిన విధంగా అర్హత మార్కులు సాధించాలి. పేపర్-1లో అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్-2ను మూల్యాంకనం చేస్తారు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు 1/3 మార్కుల కోత విధిస్తారు.
 
 పరీక్షకు సన్నద్ధమిలా
  పేపర్-1:
 ఇందులో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియా-వరల్డ్ జాగ్రఫీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్:
 అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యుమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. సిరీస్, క్లాసిఫికేషన్స్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, దూరం-కాలం, లాభ-నష్టాలు, పై చార్ట్‌లు, గ్రాఫ్‌లు, టేబుల్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. ఈ విభాగంలో రాణించేందుకు ఇంగ్లిష్ అక్షర క్రమంలోని అక్షరాల స్థానాలను ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు పుక్కిట పట్టాలి, ఎక్కాలు, వర్గాలు, ఘనాల విలువలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు వంటి ప్రక్రియలపై పట్టు సాధించాలి.
 
 జనరల్ సైన్స్:
 ఇందులో దైనందిన జీవితంలో ఎదురవుతున్న వివిధ సైన్స్ అంశాల్లో అభ్యర్థికున్న జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇటీవల జరుగుతున్న తాజా పరిణామాలు ముఖ్యంగా పర్యావరణం, జీవ సాంకేతికశాస్త్రం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అనువర్తనాలు, తదితర అంశాలకు సంబంధించి ప్రాథమిక స్థాయి భావనల ప్రశ్నలను అడుగుతారు.
 
 కరెంట్ ఈవెంట్స్:
 ఇందుకోసం గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జాతీయ,
 అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనించాలి. కళలు, సంగీతం, సాహిత్యం, క్రీడల్లో అవార్డులు పొందిన వారి గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. వివిధ దేశాల మధ్య జరిగిన ముఖ్య ఒప్పందాలు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విదేశాలతో భారత్ ఏర్పర్చుకున్న వ్యాపార, సాంఘిక, వ్యూహాత్మక ఒప్పందాల గురించి తెలుసుకోవాలి.
 
 ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ:
 దేశ రాజకీయ, ఆర్థిక విధానంపై అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు వస్తాయి. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, దాని నిర్మాణం, అందులోని ప్రకరణలు, సవరణలు, పార్లమెంట్, హైకోర్టు, సుప్రీంకోర్టు, పరిపాలన వ్యవస్థ, రాష్ర్టపతి, గవర్నర్ల అధికారాలు, భద్రతాంశాలు, పోలీస్ చట్టాలు, మానవ హక్కులు, ఆర్థికంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, రిజర్వ్ బ్యాంక్ పాత్ర, దాని విధాన నిర్ణయాలు, విదేశీ పెట్టుబడులు, ఆర్థిక వేత్తలు - సిద్ధాంతాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
 
 భారత చరిత్ర:
 సింధు నాగరికత, భారత్‌ను పాలించిన రాజ వంశాలు, చక్రవర్తులు, ఆనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, భారత స్వాతంత్య్ర పోరాటం, బ్రిటిష్ పాలన, తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
 
 ఇండియా-వరల్డ్ జాగ్రఫి:

 ఇందులో భారత్, ప్రపంచ భౌగోళిక పరిస్థితులపై అవగాహనను పరీక్షించే ప్రశ్నలను అడుగుతారు. ఈ క్రమంలో నదులు, సముద్రాలు, వివిధ శీతోష్ణస్థితులు, అడవులు, ఖనిజాలు, పర్వతాలు, శిఖరాలు, విశ్వం, తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
 
 పేపర్-2:
 ఈ పేపర్.. పార్ట్-ఏ, బీ అనే రెండు భాగాలుగా ఉంటుంది.
 పార్ట్-ఏ: ఇందులో నిర్దేశించిన అంశంపై ఒక వ్యాసం రాయాలి. దీనికి 80మార్కులు. భారత  స్వాతంత్య్ర పోరా టం, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ, దేశ భద్రతకు సంబంధించిన చట్టాలు, వ్యవస్థలు, మానవ హక్కులు వంటి అంశాలకు సంబంధించి వ్యాసం అడిగే అవకాశం ఉంది. ఈ విభాగంలో రాణించడానికి రోజుకో అంశాన్ని ఎంచుకొని వ్యాసం రాయడాన్ని బాగా సాధన చేయాలి. ప్రశ్నలో దేని గురించి అడిగారో గమనించి ఆ అంశంలో  తెలిసినదంతా కాకుండా అడిగిన మేరకే రాయాలి. వాటికి సంబంధించి నిపుణుల నిర్వచనాలు, గణాంకాలను పేర్కొంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ అంశంలో తాజా పరిణామాలు ఏమైనా ఉంటే వాటి గురించి ప్రస్తావిస్తే ఎస్సే సంపూర్ణమవుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు ఎస్సే కోసం ప్రిపరేషన్‌లో అదనపు సమయం వెచ్చించాలి. ఇంగ్లిష్ పదజాలంపై, వాక్య నిర్మాణ శైలిపై పట్టు సాధించాలి. ఈ విభాగాన్ని ఇంగ్లిష్ లేదా హిందీ భాషల్లో రాయొచ్చు.
 
 పార్ట్-బీ: ఈ పేపర్‌కు 120 మార్కులు కేటాయించారు. ఇందులో కాంప్రహెన్షన్, ప్రెసీస్ రైటింగ్, గ్రామర్.. ఇలా ఇంగ్లిష్ ప్రావీణ్యానికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం కోసం ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకం చదివితే మంచిది. రోజూ ప్రెసీస్ రైటింగ్, కాంప్రహెన్షన్ సాధన చేస్తూ గ్రామర్ (సినానిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్స్, టెన్సెస్, తదితరాలు) గురించి చదువుకోవాలి. ఈ విభాగంలో మాత్రం ఇంగ్లిష్‌లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
 
 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్ ఇలా:
 రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇందులో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనే రెండు అంశాలు ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో.. అభ్యర్థులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలను పరీక్షిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని మాత్రమే తర్వాతి దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు అనుమతిస్తారు. ఇందులో వివిధ రకాల ఫిజికల్ ఈవెంట్లు ఉంటాయి. అవి..
 
     ఈవెంట్    పురుషులు    మహిళలు
     100 మీ. పరుగు    16 సెకన్లు    18 సెకన్లు
     800 మీ. పరుగు    3 ని. 45 సె.    4 ని. 45 సె.
     లాంగ్ జంప్    3.5 మీ.    3 మీ.
     (మూడు ప్రయత్నాలు)
     షాట్ పుట్(7.26 కిలోలు)    4.5 మీ.
 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్‌లోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 150 మార్కులు కేటాయించారు.
 
 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్‌కు ఇలా
 పరీక్ష తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చనే ధోరణిలో ఎక్కువ మంది ఉంటారు. కానీ పరీక్షతోపాటు ఫిజికల్ టెస్ట్‌కు ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఇదివరకు ఎలాంటి అనుభవం లేని వాళ్లు పరీక్ష నాటికి మూడు నెలల ముందు నుంచి సాధన చేయడం ఉత్తమం. ప్రస్తుత వేసవి తరుణంలో ఉదయం  5 గం. నుంచి  7 గం., అలాగే సాయంత్రం 5.30 తర్వాత ప్రాక్టీస్ చేయడం శ్రేయస్కరం. నెల రోజుల తర్వాత ఎంత సమయంలో పరుగెత్తుతున్నారో చూసుకోవాలి. వీలైనంత వరకు మైదాన ప్రాంతాలనే ఎంచుకోవాలి. లేదంటే యాంకిల్, మోకాలిపై ఒత్తిడి పడుతుంది. కొత్తగా సాధన చేస్తున్నవాళ్లు మొదటి రోజు నుంచే నిర్దేశిత సమయంలో పరుగెత్తాలనుకోవడం పొరపాటు. దీనివల్ల అలసటకు గురవుతారు. శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. నీళ్లు బాగా తాగాలి. షాట్‌పుట్, లాంగ్ జంప్‌కు మాత్రం వారం రోజుల పాటు శిక్షకుల సలహాలను తీసుకుంటే మంచిది. లాంగ్‌జంప్ కోసం చదునైన ఇసుక నేలను ఎంచుకోవాలి. లాంగ్ జంప్ చేసేటపుడు రెండు పాదాలు ఒకే చోట పడేలా చూసుకోవాలి. లేదంటే యాంకిల్ ట్విస్ట్ వస్తుంది. షూస్ తప్పనిసరిగా ధరించాలి. ఇవన్నీ సులువైన  లక్ష్యాలే అయినప్పటికీ స్వల్ప జాగ్రత్తలు పాటించాలి. పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ సాధన చేసే సమయంలో ఎలాంటి చిన్న నొప్పులు వచ్చినా అశ్రద్ధ చేయకుండా తక్షణమే వైద్యుణ్ని సంప్రదించాలి.
 
 డాక్టర్ సుధీర్, ఆర్థోపెడిక్ యం.ఎస్.,
 అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, శ్రీకాకుళం.
 
 ఇవి చదివితే మేలు
     ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతుల గణితం, సైన్స్, సాంఘికశాస్త్రాల పుస్తకాలు
     ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల చరిత్ర, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం -ఆర్‌ఎస్ అగర్వాల్ అర్థమెటిక్, రీజనింగ్ బుక్స్ (చాంద్ పబ్లికేషన్స్)
     మనోరమ ఇయర్ బుక్
     రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్
     వర్డ్ పవర్ మేడ్ ఈజీ (నార్మన్ లూయీస్)
     జనరల్ అవేర్‌నెస్-ప్రతియోగితా దర్పణ్
 
 
 నోటిఫికేషన్ సమాచారం
     విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
     శారీరక ప్రమాణాలు:
 ఎత్తు:    పురుషులు.    మహిళలు
     165 సెం.మీ,    157 సెం.మీ.
 బరువు:    పురుషులు    మహిళలు
     50 కిలోలు,    46 కిలోలు
 (నిర్దేశించిన విధంగా ఎత్తుకు తగ్గ బరువు).
     ఛాతీ: 81సెం.మీ.(గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి, పురుషులకు మాత్రమే). స్పష్టమైన కంటి చూపు
 తప్పనిసరి.
     వయోపరిమితి: ఆగస్ట్ 1, 2014 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో సడలింపు)


     రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు:
     హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
     దరఖాస్తు ఫీజు: రూ. 200 (ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
     దరఖాస్తు విధానం: www.upsconline.nic.in
     వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
     దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 12, 2014.
     పరీక్ష తేదీ: జూలై 13, 2014
     వెబ్‌సైట్: www.upsc.gov.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement