
విశాఖ: ఓ వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి గత నెలలో దాడి చేస్తే.. ఇప్పటికి కేసు నమోదైంది. గత నెలలో సర్వసిద్ధి అనంతలక్ష్మి.. ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టింది. అది కూడా పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తి ఉండగా దాడికి దిగింది టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మి.
అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టింది. అంతే కాదు.. తనపై కేసు పెడితే బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి బెదిరించింది. అధికారంలో ఉన్నామనే గర్వంతో పోలీసుల్నే భయపెట్టింది. ఇది జరిగి సుమారు నెల అయ్యింది. అయితే దీనిపై ఎట్టకేలకు కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు గాజువాక సీఐ పార్థసారధి.
ఇంత ఆలస్యం ఎందుకో..?
అయితే టీడీపీ నేత కాబట్టి కేసు నమోదు చేయడానికి పోలీసులు అలక్ష్యం ప్రదర్శించారు. కేసును ఏదో రకంగా పక్కదారి పట్టించే యత్నం చేశారు. కాకపోతే అనంతలక్ష్మిపై కేసు ఏమైందని పలువురు పదే పదే ప్రశ్నించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదైతే చేశారు కానీ, దాన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళతారో అనేది చూడాలి. కాలయాపన చేసి కేసును మాయం చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది.

అదే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతల విషయానికి వచ్చే సరికి కళ్లముందు తప్పుకనిపిస్తున్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఆ నేతలు ఏం చేస్తున్నా చూస్తూ మిన్నుకుండిపోతున్నారు. అనంతలక్ష్మిపై కేసు నమోదు చేయడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ. కేసు అయితే పెట్టాం కదా అని చెప్పుకోవడానికే ఈ తతంగం నడుపుతున్నారా.. లేక నిజంగానే ఆమెపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.