
జీఎస్‌డీపీ 8.21 శాతమన్న సర్కారు అంచనాలపై ఆర్థిక నిపుణుల విస్మయం
రాష్ట్రం సొంత ఆదాయాల్లో భారీగా తగ్గుదల.. రిజిస్ట్రేషన్ల రాబడికి గండి
ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో జీఎస్టీ వసూళ్లు తక్కువే
మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35%.. మూలధన వ్యయం 42.78% తగ్గుదల
ఉపాధి లేదు.. ఉద్యోగాలు లేవు.. పరిశ్రమలు రాలేదు.. మరి వృద్ధి ఎక్కడి నుంచి వచ్చినట్లు?
సాక్షి, అమరావతి: ఒకపక్క రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం తగ్గిపోతున్నట్లు గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నా.. 2024–25లో ఫిబ్రవరి వరకు 2.16 శాతం వార్షిక వృద్ధి మాత్రమే నమోదైనా.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఏకంగా 8.21 శాతంగా ఉంటుందని టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించుకోవడంపై ఆర్థిక రంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35% తగ్గిపోగా మూలధన వ్యయం 42.78% తగ్గిందని.. ఏ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్ర ఆదాయాలు బాగా తగ్గాయని విశ్లేషిస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదు.. పరిశ్రమలు రాలేదు.. ఉద్యోగాలు రాకపోగా ఉన్నవే ఊడుతున్నాయి.. రాష్ట్రం సొంత పన్నులు, రిజిస్ట్రేషన్ల ఆదాయాలు అడుగంటాయి..! మరి వృద్ధి ఎలా సాధ్యం..? ఎక్కడి నుంచి వచి్చనట్లు? అని ప్రశి్నస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్‌డీపీలో ఏపీ బలమైన వృద్ధి నమోదు చేసిందంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంపై ఆరి్థకవేత్తలు విస్తుపోతున్నారు.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన సమాచారాన్ని మాత్రమే వెబ్‌సైట్‌లో పొందుపరిచారని, ఇంకా 15 రాష్ట్రాలు వివరాలు పంపలేదని పేర్కొంటున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని.. చేతిలో చిల్లిగవ్వ లేదని.. గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఆదుకున్న సంక్షేమ పథకాలు ఆగిపోవడంతో దిక్కు తోచని పరిస్థితిల్లో ఉన్నారని.. ఇలాంటి తరుణంలో వృద్ధి రేటు పెరుగుదల ఎలా సాధ్యమని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.
సర్కారు సొంత నివేదికే: బొత్స
2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35% తగ్గగా, మూలధన వ్యయం 42.78% తగ్గిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇలాంటప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 8.21%గా ఉంటుందని మీ ప్రభుత్వం అంచనా వేయడం సమర్థనీయమేనా? అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. నిరుత్సాహకరమైన పనితీరు కనబరిచినప్పటికీ జీఎస్‌డీపీ వృద్ధి రేటు 8.21%గా ఉంటుందని అంచనా వేయడం పాలనలో మీ సామర్థ్యాన్ని సూచిస్తుందా? లేక రాజకీయ కుట్రలలో మీ ప్రతిభను సూచిస్తుందా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈమేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌డీపీలో ఏపీ బలమైన వృద్ధి నమోదు చేసిందని ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేయడాన్ని బొత్స తిప్పికొట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నివేదికే గానీ మరొకటి కాదన్నారు. ఈ గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకున్న ముందస్తు అంచనాలు మాత్రమేనని, వాటికి ఎలాంటి హేతుబద్ధత ఉండదన్నారు.