
చూడప్పా సిద్దప్పా ‘నేను సింహం లాంటోడిని...అది గడ్డం గీసుకోదు...నేను గడ్డం గీసుకుంటాను...మిగతాదంతా సేమ్ టు సేమ్’ అన్న మీ డైలాగ్ విని ఎంతో మురిసిపోయాం. మాపై మీకున్న ప్రేమకు ఫిదా అయ్యాం. మీ పంజా సినిమా టైటిల్ చూసి పులులంతా సంబరాలు చేసుకున్నాయి. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలుతో జడ వేయకూడదురోయ్... అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫొటో తీయించకూడదు రోయ్. అంటూ అత్తారింటికి దారేది చిత్రంలో చెప్పిన డైలాగ్‌కు జూలో చప్పట్ల మోత మోగించాం. మా గురించి మీ సినిమాల్లో వాడుకుని రికార్డులు సృష్టించిన మీరు డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి హోదాలో తొలిసారి జూకి వస్తున్నారు. చాలా సంతోషం..అయితే మీరొస్తున్నారని తెలిసి గుండెనిండా ఆవేదనతో సమస్యలు నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం. జూలో ఉంటున్నాం కానీ తీరని ఆవేదన అనుభవిస్తున్నాం. మా వేదన తీరుస్తారని, మా కన్నీళ్లు తుడుస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాం. మాట నిలుపుకుంటారా? సినిమా డైలాగ్స్‌తో సరిపెడతారో మీ చేతుల్లోనే ఉంది...
సపర్యలు చేసేవారు లేక
మానవ తప్పిదాల వల్ల మేము ఇక్కడ బందీలుగా బతుకుతున్నాం. కనీసం మాకు సరైన సపర్యలు చేసేవారు కూడా లేకపోతే ఎలా? కొందరు యానిమల్ కీపర్లు ఉన్నా, వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో మాకు సరైన సమయంలో ఆహారం పెట్టేవారు లేరు. మా ఆవాసాలను శుభ్రం చేసేవారు కరువయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. తోడు లేక ఒంటరిగా జీవిస్తున్నాం.
మా భవిష్యత్తు ఏంటి నాయకా
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ జూ పార్కులో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మేము అంతరించిపోవడం ఖాయం. మా జాతులను కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా? మమ్మల్ని ఈ దుర్భరమైన పరిస్థితుల నుంచి విముక్తి కలిగించే మార్గం లేదా?
మృత్యువాత పడుతున్నా..
ఒక్కరే డాక్టర్ మాకు వైద్యం చేస్తున్నారు. ఆయన తరుచూ విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు కూడా ఐదేళ్లు సెలవు పెట్టి అమెరికా పోయారు. ఇప్పుడు మమ్మల్ని ఇద్దరు అనుభవంలేని అవుట్‌సోర్సింగ్ వెటర్నరీ వైద్యుల చేతిలో పెట్టేశారు. రెండేళ్లుగా విదేశాల నుంచి తీసుకువచ్చిన అరుదైన మా సంతతి కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మలేసియా, సింగపూర్ తదితర దేశాల నుంచి తీసుకువచ్చిన ఒక జత జిరాఫీలు, ఒక జీబ్రా మృతి చెందాయి. రెండు జిరాఫీ పిల్లలు మృత్యువాత పడ్డాయి. నెల క్రితం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ జూలో పుట్టిన రెండు సింహం పిల్లల్ని ఇక్కడ అనుభవం లేని యానిమల్ కీపర్లు, వెటర్నరీ వైద్యులు కలసికట్టుగా పొట్టన పెట్టుకొన్నారు.
ఆవాసాలు నరకంగా ...
ఒకప్పుడు విశాలమైన మా ఆవాసాలు నేడు సంకుచితంగా మారాయి. సరైన నిర్వహణ లేక అవి అపరిశుభ్రంగా తయారయ్యాయి. తాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు. ఉండటానికి నీడ లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నాం.
తోడు లేక దిగాలు
ప్రస్తుతం ఇక్కడ మాకున్న సంఖ్య(850), మా ఎన్‌క్లోజర్లు సంఖ్య(80)ను బట్టి కనీసం 100కు పైగా పరి్మనెంట్ యానిమల్ కీపర్లు, ఆరుగురు పరి్మనెంట్ వెటర్నరీ వైద్యులు ఉంటే మేమంతా ఆరోగ్యంగా ఉండి జూకి వచ్చే సందర్శకులన హుషారుగా పలకరించగలం. మమ్మల్ని కాపాడడానికి జూలో పరి్మనెంట్ యానిమల్ కీపర్లు, పరి్మనెంట్ వెటర్నరీ వైద్యులను నియమిస్తే సంరక్షణ కలుగుతుందని మా నమ్మకం. 2011 నుంచి తోడుకోసం ఎదురు చూస్తున్న ఖడ్గ మృగం, రెండేళ్ల క్రితం జతగాడిని కోల్పోయిన చింపాంజీ, జీబ్రా, ఏడాదిన్నరగా ఒంటరిగా మిగిలిన ఆ్రస్టిచ్ తదితర మా జాతి జీవాలు తోడు కోసం ఎదురు చూస్తున్నాయి.