
అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై కూటమి కుట్ర ఎఫ్‌ఐఆర్ సాక్షిగా బయటపడింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పోలీసులు.. ఈ ఉదయం రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన్ని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టు కిరణ్ ఈ ఫిర్యాదు చేశారు. 2022లో తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్(అప్పటికీ ఇంకా పొత్తులో లేరు), నారా లోకేష్‌లపై పోసాని అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారని, అవహేళనగా మాట్లాడారని.. కాబట్టి చర్యలు తీసుకోవాలని కిరణ్ కోరారు. అయితే.. 2024 నవంబర్ 13వ తేదీనే ఆయన ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటిరోజే ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.
అదీ బీఎన్‌ఎస్ సెక్షన్ల మీద కాకుండా.. ఐపీసీ సెక్షన్ల కింద. ఇక.. అరెస్ట్ మాత్రం రెండు నెలల తర్వాతే చేశారు. అదీ మరో కేసులో అరెస్టైన టైం చూసుకుని మరీ. మరోపక్క.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30 ఫిర్యాదులకుగానూ.. 16 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరీ ఆయన్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని విషయంలో కూటమి పెద్దలు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేరు. గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న ఆయన్ని కావాలనే పీఎస్‌లకు తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. అదే టైంలో.. మిగతా చోట్ల పోలీసులు వారెంట్లను సిద్ధం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాకుంటే మరేమిటి? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్ అంశం చర్చకు రావడం.. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్‌కు దరఖాస్తు చేసుకున్నందునే ఇలా మరో కేసుతో ఆయన్ని జిల్లా తరలించారనే చర్చ నడుస్తోందక్కడ. మార్చి 5వ తేదీకి కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈలోపు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
పోలీసుల పోటీ.. అవసరమా?
నరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు.
‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు.

👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం గురించి పట్టించుకోగా.. పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్‌లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.