
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి సర్కార్ వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుపోతున్నాయి. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా సత్తెనపల్లి మండలంలోని కంకణాలపల్లిలోని అంగన్వాడీ టీచర్‌పై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
పదే పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చమంటూ టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నారని అంగన్వాడీ టీచర్ స్వర్ణలత తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా పౌష్టికాహారం ఇవ్వాలంటూ వెంకటేశ్వరరావు హుకుం కూడా జారీ చేశాడంటూ ఆమె వాపోయారు.
పోలీస్ స్టేషన్‌లో వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసిన కానీ.. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీరు దళితులు.. మా పార్టీ అధికారంలో ఉంది.. నన్నేమీ చేయలేరంటూ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చాడంటూ స్వర్ణలత తెలిపింది.
తన భర్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఐదు లక్షలు ఇప్పిస్తానని వెంకటేశ్వరరావు లక్ష రూపాయలు డిమాండ్ చేశారన్న స్వర్ణలత.. తనకు ఇద్దరు చిన్న పిల్లలని.. తనకు ఆత్మహత్య తప్ప మరో దారికి లేదన్నారు. న్యాయం చేయాలంటూ బాధితురాలు స్వర్ణలత కన్నీరు మున్నీరవుతున్నారు.
