
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం–ఈబస్ సేవా’ పథకం.. క్షేత్ర స్థాయిలో ఈవీల విస్తరణకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమైంది. పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్ సేవలకు వీలుగా ఈ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 169 పట్టణాలకు 10,000 బస్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కేటాయించనున్నారు.
ప్రభుత్వ నిర్ణయం ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ కంపెనీలకు ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకంపై జేబీఎం ఆటో వైస్ చైర్మన్, ఎండీ నిశాంత్ ఆర్య స్పందిస్తూ.. ప్రముఖ పట్టణాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పర్వత ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపులు చేయడంతో ఎలక్ట్రిక్ బస్‌లను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన్టటు అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ ఎకోసిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పీఎంఐ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సీఈవో ఆంచాల్ జైన్ సైతం దీన్ని నిర్ణయాత్మక, పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసే పథకంగా పేర్కొన్నారు. స్థానికంగా ఈబస్‌ల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు.