
సాఫ్ట్‌వేర్ పనితీరు, ధరల వ్యత్యాసాలపై వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్, ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబర్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులపై దోపిడీని ప్రభుత్వం సహించబోదని మంత్రి తెలిపారు.
యాపిల్‌పై ఆరోపణలు..
యాపిల్ తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఐఓఎస్ 18.2.1తో ఐఫోన్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఐఫోన్ వినియోగదారుల్లో 60% మంది లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇందులో కాల్ వైఫల్యాలు అత్యంత సాధారణ సమస్యగా ఉన్నాయి. బగ్స్, భద్రతా పరమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఐఓఎస్ 18.0.1, ఐఓఎస్ 18.2.1తో సహా ఇటీవల ఐఓఎస్ అప్‌డేట్స్ ఈ సమస్యలకు కారణమని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు.
ఓలా, ఉబర్ సంస్థలు..
యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విభిన్న ప్రైసింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓలా, ఉబర్‌లకు విడివిడిగా సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్ విధానంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని మంత్రి జోషి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
ఈ ఆరోపణలపై ఉబర్ స్పందిస్తూ.. ‘రైడర్ ఫోన్ కంపెనీ ఆధారంగా మేం ధరలను నిర్ణయించం. ఏవైనా అపోహలను తొలగించడం కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపింది. యాపిల్, ఓలా సంస్థలు నోటీసులపై స్పందించలేదు.