
స్టార్టప్ మహాకుంభ్‌లో జితిన్ ప్రసాద
వికసిత్ భారత్‌లో సామాన్యుడికీ పాత్ర
సంస్కరణ, ఆచరణ, పరివర్తనకు రెడీ
న్యూఢిల్లీ: స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా సంస్కరణ, ఆచరణ, పరివర్తనకు భారత్ సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర సహాయమంత్రి జితిన్ ప్రసాద పేర్కొన్నారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా లేదా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించడంలో సామాన్యుడు సైతం కీలక పాత్ర పోషించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రజలు సుస్థిర, పటిష్ట ప్రభుత్వానికి ఓటు వేయడంతో దేశం ధృడంగా ఉన్నట్లు స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా వాణిజ్యం, పరిశ్రమలు, ఎల్రక్టానిక్స్, ఐటీ పరిశ్రమల సహాయ మంత్రి ప్రసాద వ్యాఖ్యానించారు. నూతన ఆవిష్కరణల స్టార్టప్ కమ్యూనిటీ, కొత్త ఆలోచనలతో ప్రధాని మోడీ లక్ష్యాలైన సంస్కరణ, ఆచరణ, పరివర్తనా భారత్‌కు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. సామర్థ్యం, నైపుణ్యాలు గల భారత్ సవాళ్లకు సిద్ధమని ప్రపంచానికి చాటాలని సూచించారు.
7 ట్రిలియన్ డాలర్లకు
భారత్ 2030కల్లా భారత్ 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలున్నట్లు స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం జీడీపీలో ట్రిలియన్ డాలర్లను సమకూర్చడం ద్వారా ఇందుకు కీలక పాత్ర పోషించనున్నట్లు పేర్కొన్నారు. ఆవిష్కరణలతో దేశ, విదేశీ సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ రంగం ప్రాధాన్యత వహించనున్నట్లు తెలియజేశారు. దేశ భవిష్యత్ మార్పులలో టెక్నాలజీదే ప్రధాన పాత్రగా నిలవనున్నట్లు వ్యాఖ్యానించారు. డీప్ టెక్ ద్వారా హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర రంగాల పరివర్తనలో ఐటీ నాయకత్వం వహించనున్నట్లు అంచనా వేశారు. 2047కల్లా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఆర్థిక వృద్ధితోపాటు.. సాంకేతిక ఆవిష్కరణలు సైతం కీలక పాత్ర పోషించనున్నట్లు వివరించారు.
గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్ తయారీకాదు!
స్టార్టప్‌లు హైటెక్‌పై దృష్టి పెట్టాలి
వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు
దేశీ స్టార్టప్ కమ్యూనిటీ గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్, చిప్స్ తయారీ నుంచి దృష్టి మరల్చాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఏఐ తదితర హైటెక్ రంగాలపై దృష్టి పెట్టాలని స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా సూచించారు. నిజానికి మరింతమంది దేశీ ఇన్వెస్టర్లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి ప్రవేశించవలసిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. ‘డెలివరీ బాయ్‌లతో మనం సంతోషంగా ఉన్నామా? ఇదేనా భారత్ భవిష్యత్’ అంటూ ప్రశ్నించారు. ఇది స్టార్టప్‌కాదని, ఇది ఎంట్రప్రెన్యూర్‌షిప్ అని వ్యాఖ్యానించారు. మరోపక్క రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, 3డీ మ్యాన్యుఫాక్చరింగ్, తదుపరి తరం ఫ్యాక్టరీలు తయారవుతున్నట్లు తెలియజేశారు. కొత్త స్టార్టప్‌లు దేశ భవిష్యత్‌వైపు దృష్టి పెట్టాలని సూచించారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ, టెక్నలాజికల్ వృద్ధికి స్టార్టప్‌లు దోహదపడుతున్నట్లు తెలియజేశారు.