
ఫ్లాట్లలో అదనపు గది కోరుతున్న కస్టమర్లు
కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం అనివార్యమైంది. కరోనా కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీపడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్‌ఎల్–రూఫ్ అండ్ ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే నగరాలలో 2,500 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. పలు కీలకాంశాలివే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఫ్లోర్ ప్లాన్స్‌లలో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న అపార్ట్‌మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.
వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపరీ్టలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తాము ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఓ సంస్థ ఎండీ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ల్యాండ్ బ్యాంక్‌ను సమీకరించిన డెవలపర్లు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రెండో అర్ధ భాగం నుంచి గృహ లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.