టెక్‌ అంకురాల్లోనూ మహిళల హవా..!  | India ranks second after US in all-time funding for women-led tech startups | Sakshi
Sakshi News home page

టెక్‌ అంకురాల్లోనూ మహిళల హవా..! 

Published Sat, Mar 8 2025 5:33 AM | Last Updated on Sat, Mar 8 2025 5:33 AM

India ranks second after US in all-time funding for women-led tech startups

26 బిలియన్‌ డాలర్ల సమీకరణ 

అమెరికా తర్వాత రెండో స్థానం 

దేశీయంగా 7 వేల పైచిలుకు మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు 

ట్రాక్షన్‌ నివేదికలో వెల్లడి 

న్యూఢిల్లీ: వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్న మహిళా స్టార్టప్‌లు, భారీ ఎత్తున నిధుల సమీకరణలోనూ సత్తా చాటుతున్నాయి. మహిళల సారథ్యంలోని అంకుర సంస్థలు ఇప్పటివరకు 26 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆల్‌టైమ్‌ ఫండింగ్‌ విషయంలో అమెరికా తర్వాత స్థానంలో నిల్చాయి. రీసెర్చ్, అనలిటిక్స్‌ సంస్థ ట్రాక్షన్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. 

దీని ప్రకారం దేశీయంగా మహిళల సారథ్యంలోని అంకుర సంస్థల సంఖ్య 7,000 పైచిలుకు ఉంది. క్రియాశీలకంగా ఉన్న మొత్తం స్టార్టప్‌లలో వీటి వాటా 7.5 శాతం. ఇవన్నీ కలిసి ఇప్పటివరకు 26.4 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి. 2021లో అత్యధికంగా 6.3 బిలియన్‌ డాలర్లు దక్కించుకున్నాయి. 2022లో అంతర్జాతీయంగా చూస్తే మహిళా స్టార్టప్‌లు మొత్తం మీద 32.8 బిలియన్‌ డాలర్లు సమీకరించగా .. దేశీ అంకురాలు 5 బిలియన్‌ డాలర్లతో 15.18% వాటా దక్కించుకున్నాయి. 

ఇక 2024లో అంతర్జాతీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లకు ఫండింగ్‌ విషయంలో 3.96% వాటాతో అమెరికా, బ్రిటన్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలి్చంది. ఈ స్టార్టప్‌లు భారీగా నిధులను సమీకరించడంతో పాటు పరిశ్రమలకు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, భవిష్యత్‌ ఎంట్రప్రెన్యూర్లకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని ట్రాక్షన్‌ పేర్కొంది. ఇవి మరింత వృద్ధిలోకి రావాల ంటే ఆర్థిక తోడ్పాటు, మెంటార్‌షిప్, వ్యవస్థాగతంగా మద్దతు లభించడం కీలకమని వివరించింది.  

నివేదికలోని మరిన్ని విశేషాలు.. 
→ రంగాలవారీగా చూస్తే రిటైల్‌ స్టార్టప్‌లు అత్యధికంగా 7.8 బిలియన్‌ డాలర్లు, ఎడ్‌టెక్‌ 5.4 బిలియన్‌ డాలర్లు, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్‌ అంకురాలు 5 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి. బిజినెస్‌ టు కన్జూమర్‌ ఈ–కామర్స్, ఇంటర్నెట్‌ ఫస్ట్‌ బ్రాండ్లు, ఫ్యాషన్‌ టెక్‌ అంకురాలు కూడా గణనీయంగా రాణిస్తున్నాయి. 
→ మహిళా స్టార్టప్‌ల సంఖ్యాపరంగా, అలాగే ఇప్పటి వరకు సమీకరించిన నిధులపరంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి.  
→ 2021లో మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లలో అత్యధికంగా ఎనిమిది అంకురాలు యూనికార్న్‌లుగా ఎదిగాయి. 2019లో మూడు, 2020లో నాలుగు, 2022లో అయిదు ఈ హోదా సాధించాయి. అయితే, 2017, 2023, 2024లో ఒక్క యూనికార్న్‌ కూడా నమోదు కాలేదు.  
→ 2021లో మహిళా స్టార్టప్‌లు అత్యధికంగా 45 సంస్థలను కొనుగోలు చేశాయి. 2022లో ఇది 36కి, 2023లో 25కి, 2024లో 16కి తగ్గింది. 
→ 2024లో మహిళల సారథ్యంలోని అయిదు స్టార్టప్‌లు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. మొబిక్విక్, ఉషా ఫైనాన్షియల్, తన్వాల్, ఇంటీరియర్స్‌ అండ్‌ మోర్, లాసీఖో వీటిలో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement