
రెపో ఆధారిత రుణాలపై 0.10 శాతం పెంపు
న్యూఢిల్లీ: రెపో ఆధారిత రుణాల రేట్లను 0.10 శాతం మేర పెంచుతున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. రెపో రేటును ఆర్‌బీఐ ఇటీవలే పావు శాతం తగ్గించినప్పటికీ ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్), ట్రెజరీ బిల్లుల ఆధారిత రుణ రేటు (టీబీఎల్‌ఆర్), బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్‌ఆర్), రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఆర్‌బీఎల్‌ఆర్)పై బ్యాంక్ అస్సెట్ లయబులిటీ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలను ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.
ఇదీ చదవండి: పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (రెపో ఆధారితం/ఆర్‌బీఎల్‌ఆర్)ను 0.10 శాతం పెంచడంతో 8.95 శాతం నుంచి 9.05 శాతానికి చేరింది. 6 నెలల నుంచి మూడేళ్లలో కాలం తీరిపోయే రుణాలకు అమలు చేసే టీబీఎల్‌ఆర్ రేటును 0.05 శాతం తగ్గించడంతో 6.5 శాతానికి దిగొచ్చింది. బేస్ రేటును సైతం 0.05 శాతం తగ్గించగా, 9.80 శాతానికి చేరింది. సవరించిన రేట్లు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది.