
అమెరికా ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ హెచ్చరిక
ఆర్లింగ్టన్ (అమెరికా): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్‌లను విధించడం దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుందని ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు. దీనితో ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించే ముప్పు ఉందన్నారు. ఎకానమీ, ద్రవ్యోల్బణంపై టారిఫ్‌ల ప్రభావాలు ఊహించిన దానికంటే గణనీయంగా ఎక్కువగానే ఉండబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారీ దిగుమతి సుంకాలు తాత్కాలికంగా ధరల పెరుగుదలకు దారి తీయొచ్చని, దాని ప్రభావాలు దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందని పావెల్ చెప్పారు.
ఒక దఫా ధరల పెరుగుదల అనేది దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణ సమస్యగా మారకుండా చూడటం తన బాధ్యతని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంపై ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లు యథాతథంగా 4.3 శాతం స్థాయిలోనే కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను అయిదు విడతల్లో తగ్గిస్తుందని ఆశిస్తున్న ఇన్వెస్టర్లను ఇది నిరాశపర్చే అవకాశం ఉంది. పావెల్ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఆయన ద్రవ్యోల్బణంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.