
నియంత్రణలను మెరుగ్గా మారుస్తాం
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన
ముంబై: నియంత్రణ కార్యాచరణను మరింత మెరుగ్గా మార్చడం ద్వారా వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యాలను సమతుల్యం చేయ డం ద్వారా దీన్ని సాధిస్తామన్నారు. ఆర్‌బీఐ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. ఆరంభం నుంచి చూస్తే ఆర్‌బీఐ పాత్ర ఎంతో విస్తృతమైనట్టు చెప్పారు.
‘‘సంప్రదాయం–మార్పునకు మధ్య మనం నిలబడి ఉన్నాం. ధరల స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వృద్ధి అన్నవి అత్యాధునిక టెక్నాలజీలు, అంతర్జాతీయ అనిశ్చితులు, వాతావరణ మార్పుల సవాళ్లు, పెరుగుతున్న ప్రజల అంచనాలు వేగవంతమైన సాంకేతిక పురోగతితో అనుసంధానమై ఉన్నాయి’’అని ఆర్‌బీఐ గవర్నర్ వివరించారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక నిర్మాణాన్ని తీర్చిదిద్దడంలో వచ్చే దశాబ్ద కాలం ఎంతో కీలకమని పేర్కొన్నారు. మరింత మందికి ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ‘‘కస్టమర్ల సేవలు, వినియోగదారుల పరిరక్షణ స్థిరంగా మెరుగుపడే సంస్కృతిని పెంపొందించడానికి కృషి చేస్తాం. టెక్నాలజీ ఆవిష్కరణలకు మా మాద్దతు కొనసాగుతుంది’’అని ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం సహా భాగస్వాములు అందరి సహకారాన్ని తీసుకుంటామని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు.