
ముంబై: అందరికీ ఆర్థిక సేవలను మరింత చేరువ చేసే విషయమై నియంత్రణలు అనవసర అడ్డంకులు కల్పించరాదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) కార్యక్రమంలో భాగంగా మల్హోత్రా మాట్లాడారు. విధాన నిర్ణేతలు సైతం తమ చర్యల్లో అత్యుత్సాహం లేకుండా జాగ్రత్త వహించాలని.. చట్టబద్దమైన కార్యక్రమాలను అణచివేసేలా ఉండకూడదన్నారు. కస్టమర్ల హక్కులు, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యహరించాలని సూచించారు.
ఆర్థిక సేవల చేరువలో భారత్ ఎంతో ప్రగతి సాధించిందంటూ.. వయోజనుల్లో 94 శాతం మందికి నేడు బ్యాంక్ ఖాతా ఉన్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. చట్టాలు, నిబంధనలు కేవలం చట్టవిరుద్ధమైన వాటినే లక్ష్యంగా చేసుకోవాలన్నారు. అంతేకానీ, నిజాయితీ పరులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. మనీలాండరింగ్ (నల్లధన చలామణి), ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థిక వ్యవస్థను భద్రంగా కొనసాగించేందుకు వీలుగా.. విధాన నిర్ణేతలు అత్యుత్సాహ చర్యలకు దూరంగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: ఐటీ షేర్లకు ఏమైంది?
రిస్క్ తీసుకునే ధోరణి ఆర్థిక వ్యవస్థకు ఫలితాన్నిస్తుందంటూ.. అదే సమయంలో ప్రజలు, వ్యాపారాలపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కస్టమర్లను అదే పనిగా మళ్లీ మళ్లీ కేవైసీ అప్‌డేషన్ కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. టెక్నాలజీతో వ్యాపార సులభతర నిర్వహణ మెరుగుపడడమే కాకుండా.. మనీలాండరింగ్, అక్రమ రుణ వ్యాపార మార్గాలకు దారితీసినట్టు చెప్పారు. అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు వీలుగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.