
చెన్నై: ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్, చెన్నైకి దగ్గర్లోని ఒరగాడంలో రూ. 1,000 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీనితో ప్రాంతీయంగా 5,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ప్లాంటు నెలకొల్పడానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్లాంటులో ఇతర కంపెనీల కోసం ల్యాప్‌టాప్‌లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు మొదలైన వాటిని ఉత్పత్తి చేయనుంది. ఇందులో త్వరలోనే హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభమవుతుందని తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వం 100 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. డిక్సన్ టెక్నాలజీస్ 1993లో ఏర్పాటైంది. శాంసంగ్, షావోమీ, మోటరోలా, బోట్, వన్‌ప్లస్ తదితర సంస్థల కోసం కాంట్రాక్ట్ తయారీ సేవలను అందిస్తోంది.