
న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులు తన ఆస్తులను అటాచ్ చేయడం ద్వారా తాను కట్టాల్సిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని రాబట్టుకున్నాయని పరారీలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. ఇందుకు 2024–25 ఆర్థిక శాఖ వార్షిక నివేదికలోని గణాంకాలే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో నేను రూ.6వేల కోట్లు బకాయి పడితే, భారతీయ బ్యాంకులు నా నుంచి రూ.14వేల కోట్లు వసూలు చేశాయి. ఇది నేను చెల్లించాల్సిన మొత్తం కంటే 2 రెట్లు ఎక్కువ’ అని విజయ్ మాల్యా అన్నారు.
Finally against a DRT judgement debt of Rs 6203 crores, admitted recovery of Rs 14,131.8 crores which will be evidence in my UK Bankruptcy annulment application. Wonder what Banks will say in an English Court. pic.twitter.com/oRSMhm4nx2
— Vijay Mallya (@TheVijayMallya) April 6, 2025
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రాబట్టిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ, మాల్యా కేసులో రూ. 14,131.8 కోట్లు రికవర్ అయ్యిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ నివేదికలో పేర్కొన్నట్లు మాల్యా వివరించారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశించిన రూ. 6,203 కోట్ల రికవరీకి ఇది రెట్టింపు మొత్తం అని ఆయన చెప్పారు. తనను భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టులో నడుస్తున్న కేసులో ఇది కీలక సాక్ష్యంగా ఉండబోతోందన్నారు.
బ్యాంకులు దీన్ని ఏ విధంగా కోర్టులో సమర్థించుకుంటాయో చూడాలని వ్యాఖ్యానించారు. వివిధ బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 9,000 కోట్లు బాకీపడిన కేసుకు సంబంధించి 2016 మార్చిలో మాల్యా బ్రిటన్‌కు పారిపోయారు. దీంతో మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా పరిగణిస్తున్నారు. ఆయన్ను స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.