కొంటే... కొరివి దయ్యమే! | F-35 fighter jet proposal to India | Sakshi
Sakshi News home page

కొంటే... కొరివి దయ్యమే!

Published Sat, Mar 22 2025 1:50 PM | Last Updated on Sat, Mar 22 2025 3:34 PM

F-35 fighter jet proposal to India

‘‘భారత్‌ ఒక సరికొత్త ప్రపంచానికి అలవాటు పడాల్సిన అవసరం ఉంది’’ – ట్రంప్‌ను ఉద్దేశించి విదేశీ వ్యవహా రాల మాజీ కార్యదర్శి ఒకరు అన్న మాట. ఈ కొత్త ప్రపంచం కేవలం ఒప్పందాలు, వ్యాపారాలకు మాత్రమే పరిమితమనీ; మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనీ కూడా ఆయన అన్నారు. ఒక దౌత్యవేత్త ఈ అంచనాకు వచ్చారంటే కచ్చితంగా అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ అనూహ్యమైన వ్యక్తిత్వమే కారణమై ఉంటుంది.

తేలిగ్గా చెప్పాలంటే... ఈ రోజుల్లో పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. కొత్త సంవత్సరంలో యూఎస్‌ఏ తన లావా దేవీలను వేగంగా మొదలు పెట్టేసింది. ఈ ఏకపక్ష ధోరణితో అమెరికా మిత్రులు, శత్రువులు కూడా తమని తాము కాపాడు కునేందుకు దాక్కుండిపోతున్నారు. లేదంటే వ్యక్తిగతంగా ట్రంప్‌ ముందు ప్రత్యక్షమై ఆయన శీతకన్ను పడకుండా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల కూడా ఏదో అర్థవంతమైన పని జరుగుతుందని ఎవరూ ఆశించడం లేదు.

ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ట్రంప్‌ ఇప్పుడు అమెరికన్‌  కంపెనీ ‘లాక్‌హీడ్‌ మార్టిన్‌ ’ తయారు చేసిన ఎఫ్‌–35 యుద్ధ విమానాలు కొనమని భారత్‌కు చెబుతున్నారు. భారత్‌తో ఉన్న సుమారు 3,500 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అన్నమాట. అయితే ఏ అంత ర్జాతీయ ఒప్పందం, వ్యాపారమైనా కేవలం అమ్ముతామంటే సరిపోదు. కొంటున్నామని అవతలి వారు చెప్పాలి. భారత్‌దృష్టి కోణం నుంచి చూస్తే – అమెరికా అమ్ముతానూ అంది, మరి కొనదలుచుకుంటే ఆ ఎఫ్‌–35 యుద్ధ విమానాలు ఎలాంటివో పరిశీలించాలి కదా?

తడిసి మోపెడు ఖర్చు
రవాణా, గాల్లోంచి సామగ్రి పడవేసే ‘డగ్లస్‌ డీసీ–3 డకోటా’, ‘ఫెయిర్‌ ఛైల్డ్‌ ప్యాకెట్‌ సీ119 జీ’ మినహా మరే ఇతర అమెరికా విమానాన్నీ భారతీయ వైమానిక దళం ఇంతవరకు వాడలేదు. 1947 నుంచి చూసినా అమెరికా యుద్ధ విమానం మన వద్ద ఎప్పుడూ లేదు. కాబట్టి అకస్మాత్తుగా ఎఫ్‌–35లను కొనుగోలు చేయడం అంటే, అది కూడా ట్రంప్‌ మాటపై ఆధారపడి అంటే... కొంచెం అనుమానంగా చూడాల్సిన వ్యవహారమే! అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు, చరిత్ర లను పరిగణనలోకి తీసుకుంటే ఇలా చూడటం మరీ ముఖ్య మవుతుంది. 

ఒక విషయమైతే స్పష్టం. భారత్‌ వంటి అతిపెద్ద దేశంలో వైమానిక దళం ఒక్క రోజులో సిద్ధం కాదు. వైమానిక దళాన్ని నిర్మించడం అంత తేలికైన వ్యవహారమూ కాదు. భారీ పెట్టు బడులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, రిస్క్‌ తీసుకో గలిగిన తెగువ, సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ‘జేన్‌ ్స ఆల్‌ ద వరల్డ్స్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌’ మ్యాగజైన్‌∙ప్రకారం... ఎఫ్‌–35 యుద్ధ విమానాలకు (ఐదో తరం, బహుళార్థక, స్టెల్త్‌ రకం) ఆర్డర్‌ పెట్టిన తరువాత మొదటి విమానం అందేందుకు 15 ఏళ్లు పడుతుంది! ఇంకో విషయం – భారత్‌ ఏ రోజు కూడా లాక్‌ హీడ్‌ తయారు చేసే యుద్ధ విమానపు కొనుగోలుదారుగా కానీ, అమెరికా పారిశ్రామిక భాగస్వామిగా కానీ లేదు. 

నిజానికి ఎఫ్‌–35 యుద్ధ విమానాలు హైటెక్‌ పాశ్చాత్య దేశాల కోసం, అమెరికా రక్షణకు, సెక్యూరిటీ భాగస్వాములైన ఇతర దేశాల కోసం ఉద్దేశించినవి. 1996లో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్, సింగపూర్, స్పెయిన్‌ , స్వీడన్‌ లకు ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఎఫ్‌–35లు ఖరీదైనవని అప్పుడే అర్థమైపోయింది (ట్రంప్‌ సుంకాల తీరుతో తాజాగా నాటో దేశాలు కూడా వీటి కొనుగోలు గురించి పునరాలోచనలో పడ్డాయి).

ముందుగా యూకేతో కలిసి పనిచేయాలని, పది శాతం ఖర్చులు ఆ దేశం భరించాలని యూఎస్‌తో ఒప్పందం జరిగింది. ఇటలీ, నెదర్లాండ్స్‌ చెరి ఐదు శాతం ఖర్చులు భరించేలా ఒప్పందాలు కుదిరాయి. మూడో దశలో డెన్మార్క్, నార్వే... 1–2 శాతం ఖర్చులు భరించేలా భాగస్వాములైనాయి. అనంతరం, ఆస్ట్రేలియా, కెనడా, టర్కీ తమ ఖర్చు తామే భరించేలా చేరాయి. 2012–13 నాటి ‘జేన్‌ ్స ఆల్‌ ద వరల్డ్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’ పత్రికను చూస్తే ఒక్కో ఎఫ్‌–35ఎ యుద్ధ విమానం ఖరీదు సుమారు 3.73 కోట్ల డాలర్లు. 2017 నాటికి ఇది 9.43 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు సుమారు పది కోట్ల డాలర్ల పైమాటే (రూ.860 కోట్లు). మారకం విలువలు, రూపాయి బలహీనపడటం వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్‌–35ల కొనుగోలు భారత్‌ ఖజానాకు భారీగా కన్నమేసేదే! ఇంత భారీ ఖర్చు కచ్చితంగా రాజకీయంగానూ సంచలనంసృష్టిస్తుంది.

దీంతోపాటే ఎఫ్‌–35 యుద్ధ విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన సంబంధిత సమస్యలు చాలానే ఉన్నాయి. అమెరికాలోనూ దీని గురించి వివాదాలు ఉన్నాయి. సమస్యలు ఒకవైపు, ఎప్పటికప్పుడు పెరిగిపోయే ఖర్చులు ఇంకోవైపు ఈ యుద్ధ విమానపు కొనుగోలుపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఆర్థికాంశాలు, సాంకేతిక పరిజ్ఞాన అంశాలూ కాసేపు పక్కన పెడదాం. యుద్ధ విమానం భద్రత కూడా ఇక్కడ ప్రశ్నా ర్థకమే. 2010 అక్టోబరులో ఇలాంటి ఒక సమస్యను గుర్తించారు. విమానం ఎగురుతూండగానే ఎలాంటి ఆదేశాలూ లేకుండానే ఇంజిన్‌  ఆఫ్‌ అయ్యేందుకు వీలు కల్పించే ఓ సాఫ్ట్‌ వేర్‌ సమస్య తలెత్తింది. 

అప్పట్లో ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో ఈ విమానాలను కొంత సమయం పాటు నిలిపివేశారు కూడా! పదిహేనేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ఈ యుద్ధ విమానం ప్రయాణిస్తూండగా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. 2014 జూన్‌ , జూలైల్లో ఎగ్లిన్‌  ఎయిర్‌ఫోర్స్‌ స్థావరం వద్ద కొన్నింటిలో ఇంజిన్‌  వైఫల్యం చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత వాటి వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కనుక అలాంటి విమానాలను కొని, కొరివితో తలగోక్కునే పరిస్థితిని భారత్‌ తెచ్చు కోదనే ఆశిద్దాం!


 

అభిజిత్‌ భట్టాచార్య
వ్యాసకర్త ‘ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ శాశ్వత సభ్యులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement