
భారతదేశంలో ఇష్టమైన చిరుతిండి అనగానే చెప్పేది పానీపూరి. ఇదంటే పెద్దలే కాదు.. చిన్న పిల్లలకు యవతకు ఎంత ఇష్టమో తెలిసిందే. మంచి స్ట్రీట్ ఫుడ్‌గా మహా ఫేమస్. అలాంటి ఈ వంటకం ప్రస్తుతం ఆరోగ్య పరంగా మంచిది కాదని తినొద్దని హెచ్చరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం అపరిశుభ్రంగా తయారు చేయడమే. అందుకు గతంలో ఎన్నో సంఘటనలు సాక్ష్యంగా నిలిచాయి. అంతేగాదు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో ఈ చిరుతిండి అమ్మకాలను నిషేధించారు కూడా. ముఖ్యంగా ఈ పానీపూరీలో వినయోగించే మసాలా నీరు కోసం కలుషితమైన నీటిని వినియోగించడంతోనే అసలు చిక్కు అంతా వచ్చిపడుతోంది. ప్రస్తుతం ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఈ వంటకం అసలు ఎలా వచ్చిందో..? దీన్ని ఎవరూ తయారు చేశారో తెలిస్తే విస్తుపోతారు. మరీ ఆ కథేంటో చూద్దామా..!
పానీ పూరి పురాతన భారతదేశంలో 16 మహాజనపదాల కాలంలో ఉద్భవించిందని చెబుతున్నారు పాకశాస్త్ర నిపుణులు. మొదట్లో స్వీట్ రూపంలో వచ్చి.. ఇలా మసాలతో తయారు చేయడం జరిగిందనేది వాదన. బిహార్ దీని జన్మస్థలంగా చెబుతుంటారు. అంతేగాదు దీనికి మహాభారతం కనెక్షన్ కూడా ఉందంట.
ద్రౌపది పాండవులను వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చినప్పుడూ.. ఆమె పాక నైపుణ్యంపై పరీక్ష పెట్టిందట కుంతీదేవి. ఆమెకు తగినంత పూరీ పిండి, కొన్ని బంగాళ దుంపలు, మసాలా దినుసులు ఇచ్చి.. తన కుటుంబానికి సరిపడా రుచికరమైన వంటకం చేయాలని చెప్పింది కుంతీదేవి. అయితే ఆమె ఇచ్చిన పిండి తన భర్తలు ఐదుగురు, అత్తకు సరిపడేలా చేయడం అనేది అసాధ్యం.
ఎందుకంటే భీముడి ఎంత తింటాడో తెలియంది కాదు. మరి ఆ కొద్ది మొత్తం పిండితో ఎలా అని ఆలోచించి ద్రౌపది చిన్న చిన్న పూరీలలా గట్టిగా వచ్చేలా చేసిందట. సహజంగా నీళ్లుతాగితే కడుపు నిండిపోతుంది. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కుదరదు. ఎలాగో గట్టిగా కరకరలాడే ఈ పూరీలను తినాంటే.. మాములు కూరతో సాధ్యం కాదు. అదే నీళ్ల మాదిరి రసం లాంటి దానితో తింటే..కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
అందరికీ సరిపెట్టొచ్చు అని భావించి ఆమె మసాలాలన్నింటిని కలపి చక్కటి పలుచటి రసంలా తయారు చేసిందట. ఆ తర్వాత ఈ పూరీల మధ్యలో చిల్లుపెట్టి ఈ మసాలా నీటిని పోసి సర్వ్ చేసి అందరికి వచ్చేలా చేసిపెట్టిందట ద్రౌపది. ఆమె తెలివికి అబ్బురపడి నా కోడలు చాలా తెలివైనదని తెగ మురిసిపోయిందట కుంతీదేవి. ఈ కథ నిజమా? కాదా? అనేందుకు సరైన ఆధారాలు లేకపోయినా..పరిస్థితులు సవ్యంగా లేనప్పుడూ ఇంట్లో ఉన్నవాటితో రుచికరంగా అందరికీ సరిపడేలా వంట చేయడం ఎలాగో తెలియజెబుతోంది.
పైగా కాబోయే కోడళ్లకు ఇంటిని ఎలా చక్కబెట్టాలో తెలియజేస్తుంది. చివరగా పానీపూరీ మాత్రం స్ట్రీట్ సెంటర్లలో కాకుండా ఇంట్లోనే ఈజీగానే చేసుకునే పలు విధానాలు వచ్చేశాయి. అవి తెలుసుకుని హాయిగా నచ్చిన ఫుడ్ ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఉందాం..!. ఇంటి వంటే ఆరోగ్యం అని విశ్వసిద్దాం.
(చదవండి: అందాల పోటీలో 'సీపీఆర్' స్కిల్ టెస్ట్..! భారత్ 72వ మిస్ వరల్డ్‌లో..)