
విశ్లేషణ
కోవిడ్ మహమ్మారి కాలంలో లక్షలాది మంది నగరాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. మహమ్మారి ముగిసిన తర్వాత వీరందరూ తిరిగి నగరా లకు చేరుకుంటారన్న అంచనాలకు భిన్నంగా గ్రామాల్లోనే ఉండిపోయారు. 2020–22 మధ్య కాలంలో గ్రామీణ శ్రామిక శక్తికి సుమారు 5 కోట్ల 60 లక్షల మంది కార్మికులు జోడించబడ్డారు. వీళ్లలో ఎక్కువమంది యువత. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివాటిని మినహాయిస్తే, చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించే ఆర్థిక విధానాలకు బదులుగా, వ్యవసాయాన్ని స్థిరమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చాలి.
భారత ప్రజలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. గత ఐదేళ్లలో, పట్టణ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, ‘తక్కువ–ఉత్పాదకత’ కలిగిన వ్యవసాయం నుండి కార్మికులను బయటకు నెట్టడానికి సంకల్పించిన విధానం ఇప్పుడు అడ్డం తిరిగింది.
కోవిడ్–19 మహమ్మారి కాలంలో మొదటిసారి తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయి. లక్షలాది మంది పట్టణ పేదలు అనంత దూరాలు, చాలామంది కాలినడకన తమ తమ ఊళ్లకు ప్రయా ణించారు. దేశ విభజన రోజుల తర్వాత ఇది ప్రజల అతిపెద్ద చలనం. కనీవినీ ఎరుగనంత స్థాయిలో సాగిన ఈ అంతర్–రాష్ట్ర వలసలు, రాష్ట్రం లోపలి వలసలు తాత్కాలికమని నమ్మారు. కానీ, మహమ్మారి ముగిసిన తర్వాత శ్రామికశక్తి నగరాలకు తిరిగి వస్తుందనే అంచనాను తోసిపుచ్చుతూ, వాళ్లలో ఎక్కువ మంది తమ ఊళ్లలోనే ఉండడానికి ఇష్టపడటం జరిగింది.
వ్యవసాయంలోనే ఉపాధి
‘నేషనల్ శాంపిల్ సర్వే’, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ల డేటా ఆధారంగా, ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’, న్యూఢిల్లీకి చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్’ రూపొందించిన ఒక నివేదికలో వ్యవసాయ ఉపాధి పెరిగిందని తేలింది. సాధారణ అభి ప్రాయానికి విరుద్ధంగా, 2020–2022 మధ్య గ్రామీణ శ్రామికశక్తికి 5 కోట్ల 60 లక్షలమంది కార్మికులు జోడించబడ్డారు. నిరుద్యోగం వృద్ధి చెందుతున్న సమయంలో, నగరాల్లో లభించే ఉపాధి అవకాశాలు వలస కార్మికులకు అంతగా ఆకర్షణీయంగా లేవని ఇది నిరూపిస్తోంది. తయారీ రంగంలో మందగమనం, నిర్మాణ రంగ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడం వల్ల నగరాలకు వలస వచ్చినవారు గ్రామాలకు తిరిగి వెళ్లడమే మంచిదని భావించారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2004–05, 2018–19 మధ్య అంటే 13 సంవత్సరాల కాలంలో 6 కోట్ల 60 లక్షల మంది వ్యవసాయ శ్రామికులు పట్టణాలలో చిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. కానీ 2018–19, 2023–24 మధ్య ఐదేళ్లలో 6 కోట్ల 80 లక్షల మంది పైగా ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యా లయానికి చెందిన ఆర్థికవేత్త హిమాన్షు అంచనా వేశారు. వ్యవసాయం అకస్మాత్తుగా లాభదాయకంగా మారిందని దీని అర్థం కాదు. ప్రజ లను పొలాల నుండి బయటకు నెట్టడం ఆచరణీయమైన వ్యూహం కాదని ఇది స్పష్టంగా చెబుతోంది.
గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయం వాటా 2018–19లో 42.5 శాతం నుండి 2023–24లో 46.1 శాతానికి పెరిగిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక చెబుతోంది. పైగా ఇందులో గణనీయమైన యువ జనాభా కూడా ఉంది. ఇది విస్మరించలేని సందేశాన్ని ఇస్తోంది. ప్రజలను ఆ రంగం నుండి బయటకు నెట్టాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకపట్టున ఉంచిన విధానాల మీద మన ఆర్థిక ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనల తరువాత రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. తమకు సరైన ఆదాయాన్ని నిరంతరం తిరస్కరించడంపై రైతాంగం ఆగ్రహంతో ఉంది.
ప్రపంచ బ్యాంకుకు దూరంగా– గాంధీజీకి దగ్గరగా!
భారతదేశం తన వ్యవసాయరంగం నుండి 40 కోట్ల మంది ప్రజలను నగరాలకు వలసబాట పట్టించాలని ప్రపంచ బ్యాంకు 1996లో కోరింది. ఇది బ్రిటన్, ఫ్రాన్ ్స, జర్మనీల ఉమ్మడి జనాభా కంటే రెండింతలకు సమానం. అయితే పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడానికి వీలుగా ఆర్థిక పరిస్థితులను సృష్టించే బదులు, వ్యవ సాయాన్ని ఆచరణీయమైన వాణిజ్యంగా మార్చడం ద్వారా వ్యవ సాయాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించాలి. మహాత్మా గాంధీ కోరుకున్నది ఇదే. వలస కార్మికులు తిరిగి వచ్చిన రేటు ఆయన అభి ప్రాయం ఎంత సరైనదో చూపిస్తుంది. అందువల్ల, ప్రపంచ బ్యాంకు ఆలోచనను విడనాడి వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం, వ్యవసాయాన్ని స్థిరమైన, ఆచరణీయమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.
మీకు ఇంకా నమ్మకం లేకుంటే, ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్’ (నాబార్డ్)కు చెందిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే 2021–22’ నివేదికను చూడండి. దీని ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న జనాభా వాటా సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. 2016–17లోని 48 శాతం నుండి 2023–24లో గరిష్ఠంగా 57 శాతానికి చేరుకుంది. వ్యవసాయ కుటుంబాల సంఖ్యలో పెను గంతు స్థానికుల తిరిగిరాకను స్పష్టంగా సూచిస్తోంది.
వ్యవసాయ కుటుంబాల వాటా 2016–17లో 42 శాతం నుండి 2021–22 నాటికి 36 శాతానికి తగ్గిన పంజాబ్; 70 నుండి 63 శాతానికి తగ్గిన హిమాచల్ ప్రదేశ్, కొంచెం తగ్గుదల చూపిన గుజరాత్, కర్ణాటకలను మినహాయిస్తే... అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల పెరుగుదల గణనీయంగా ఉంది. వ్యవసాయ కుటుంబాలు గోవాలో 3 నుండి 18 శాతానికి, హరియాణాలో 34 నుండి 58 శాతానికి పెరిగాయి. ఉత్తరా ఖండ్‌లో 41 నుంచి 57 శాతం; తమిళనాడులో 13 నుండి 57 శాతం పెరుగుదల కనబడింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పెరుగుదల ధోరణినే చూపుతున్నాయి.
కారణాలు ఏమైనప్పటికీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నాబార్డ్ చేసిన మూడు అధ్యయనాలు కూడా ఉపాధి, జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి. అందుకే గృహ ఆహార భద్రతను నిర్ధారించడంలో వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని విస్మరంచకూడదు.
ఆందోళనలో శుభవార్త వ్యవసాయంలో సంఖ్యలను తగ్గించడంపై ఆధారపడిన మును పటి ఆర్థిక విధానాలను రివర్స్ మైగ్రేషన్ తారుమారు చేసినప్పటికీ, వ్యవసాయంలో ఉపాధి పెరుగుదలను ప్రధాన ఆర్థికవేత్తలు ‘ఆందో ళన కలిగించే అంశం’గా చూస్తున్నారు.
భారతదేశంలో కనిపిస్తున్న ఈ తిరుగు వలసల ధోరణి తక్కువ మధ్య–ఆదాయ వర్గానికి ప్రత్యే కమైనదిగా చూస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆర్థిక విధానాలను పునరుజ్జీవింపజేయవలసిన అవస రాన్ని ఇది సూచిస్తుంది. మారుతున్న క్షేత్ర వాస్తవికతను గుర్తించాల్సిన సమయం ఇది.
ప్రభుత్వం తగిన వనరులను కల్పించడానికి సిద్ధంగా ఉంటే, వ్యవసాయంపై ఆధారపడటం దాని సొంత ఆచరణీయ మార్గాలను సృష్టిస్తుంది. వ్యవసాయం కోసం కేటాయించే బడ్జెట్ వ్యయంలో ఏదైనా పెరుగుదలను ప్రతిపాదిస్తే, అది ఆర్థిక లోటుకు అదనపు మొత్తంగా పరిగణించడాన్ని ఆర్థికవేత్తలు ఇకనైనా మానేయాలి.
‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్’ (ఓఈసీడీ) ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం మాత్రమే రైతుల నష్టాలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేయడం లేదు. నేను తరచుగా చెప్పినట్లు, రైతులు దాదాపు 25 సంవత్సరాలుగా ఏటా పంట నష్టపోతున్నారు. రైతులకు ‘దేవుడే దిక్కు’ అయ్యే ఈ లోపభూయిష్ట ఆర్థిక రూపకల్పన ఇకనైనా అంతం కావాలి.
ఒక విధంగా తిరుగు వలసలను శుభవార్తగా చూడాలి. వనరులను అత్యంత అవసరమైన చోట ఉంచడానికి ఇది సరైన సమయం. అది చివరకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు దారి తీస్తుంది.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com