
విశ్లేషణ
1990లలో, న్యూయార్క్‌లోని బ్రాడ్‌వేలో పర్యటిస్తున్న చైనా ప్రతినిధి బృందం గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక నివేదికను ప్రచురించింది. ఇతిహాసాల రంగస్థల, సంగీత, వినోద ప్రదర్శన క్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి చెందిన ‘బ్రాడ్‌వే’ అభివృద్ధి, నిర్వహణల గురించి అధ్యయనం చేసి షాంఘై లేదా బీజింగ్‌లో సరిగ్గా అటువంటి సాంస్కృతిక బహుళస్థలిని ఎలా వృద్ధి చేయవచ్చో తెలుసు కోవడమే ఆ సందర్శకుల లక్ష్యం.
అమెరికా శక్తి... దాని సైన్యంలో మాత్రమే కాదు, దాని శక్తిమంతమైన సంస్కృతిలో కూడా ఉందని చైనీయులు బాగా అర్థం చేసుకున్నారు. ఒక దేశ ‘శక్తి’కి ప్రామాణికమైన లక్షణం ఏమిటంటే, ఇతర దేశాలు తనను అనుకరించేలా స్వీయ విధానాలను రూపొందించు కోగలిగిన సామర్థ్యమే. అది సైనిక శక్తి కావచ్చు, ఆర్థికపరమైన దృఢ శక్తి కావచ్చు. సంస్కృతి, విలువలు, భావజాలంతో ఆ దేశం ప్రతిఫలించే సమ్మోహన శక్తి ద్వారా ఆ అనుకరణ మరింత సులభంగా జరుగుతుంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాలుగేళ్లపాటు, అమెరికా అణ్వాయుధాలపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో యూరప్ పునరుజ్జీవనానికి ‘మార్షల్ ప్లాన్ ’ను ప్రారంభించింది. పైగా తన ప్రపంచ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి నాటో సైనిక కూటమిని సృష్టించింది. అదే మార్షల్ ప్లాన్... ఆర్థిక, ఆరోగ్య, వాణిజ్య రంగాలలో ప్రజోపయోగ వస్తుసేవలను అందుబాటులోకి తెచ్చి ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించటానికి వీలుగా ఐక్య రాజ్యసమితిని, ప్రపంచ బ్యాంకును, అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థను, ప్రపంచ ఆరోగ్య సంస్థను, వాణిజ్య సుంకాలపై సాధారణ ఒప్పందాన్ని(గాట్) నెలకొల్పేందుకు కూడా అమెరికాకు తోడ్పడింది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాంస్కృతిక ఆకర్షణ విస్తృతం అవుతున్న కొద్దీ ఈ అంతర్జాతీయ సంస్థలు అమెరికా శక్తికి మరింత బలం చేకూర్చే సాధనాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికా తన ప్రధాన దాతృత్వ సంస్థ అయిన ‘యుఎస్ ఎయిడ్’ని మూసి వేయడం ద్వారా, ఇప్పటివరకు తన శక్తిని వినియోగించుకుని అభివృద్ధి చేసుకున్న ఆధిపత్యాన్ని తానే దెబ్బతీసుకోబోతున్నట్లు కనిపిస్తోంది.
‘యుఎస్ ఎయిడ్’ ప్రపంచంలోనే అభివృద్ధి సహాయానికి సంబంధించి అతి పెద్ద దాతృత్వ సంస్థ. ఆ సంస్థ ఏటా అందించే 70 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్, జోర్డాన్, పాలస్తీనా వంటి వ్యూహా త్మక ప్రయోజనాలు కలిగిన దేశాలకు, అలాగే తను మానవతా సహాయం అందించిన (సూడాన్, యెమెన్, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్) దేశాలకు అమెరికా పంపిణీ చేసింది.
ఆధిక్యశక్తి (హార్డ్ పవర్) స్థానంలో ఔదార్య శక్తి (సాఫ్ట్ పవర్)ని ప్రయోగించటం అమెరికా స్థిరమైన వ్యూహం. ఈ విధానాన్ని భారత్‌తో సహా ఇతర దేశాలు అనుసరించడానికి ప్రయత్నించాయి. 1950లు, 60లలో ఆరోగ్య, వ్యవసాయ, ఆహార, విద్యారంగాలలో భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో యుఎస్ ఎయిడ్ ముఖ్య పాత్ర పోషించింది. అదే సమయంలో పాక్‌ను ఆయుధీకరించే తన విధానం నుండి ఉత్పన్నమయ్యే భారతీయ అసంతృప్తిని మళ్లించ టానికి యుఎస్ ఎయిడ్‌ను అమెరికా తెలివైన మార్గంగా చేసుకుంది.
అమెరికా తన సాఫ్ట్ పవర్‌ను విదేశీ సహాయ నగదు నిధుల ద్వారా మాత్రమే కాక, నాలుగు ప్రధాన అంశాల ద్వారా కూడా ప్రయోగించింది. మొదటిది – వినోదం, మీడియా, పరిశ్రమలు, విద్యా వ్యవస్థ. రెండవది – ప్రజాస్వామ్యం, సమానత్వం, మానవ హక్కుల పట్ల, అలాగే శక్తివంతమైన పౌర సమాజం పట్ల తన నిబద్ధత. మూడవది – ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులు మొద లైనవి. నాల్గవది – తన చురుకైన వినియోగదారీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. వీటన్నిటితో కూడిన ‘సాఫ్ట్ పవర్’తో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తన హోదాను నిలుపుకొంది.
విద్యార్థులు, పరిశోధకులు, అవకాశాల కోసం చూస్తున్న వ్యాపారవేత్తలు, కళాకారులు, ప్రదర్శకులు; అలాగే చట్టబద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా పెద్ద సంఖ్యలో అమెరికాకు తరలివచ్చిన కార్మికులలో అమెరికాకు ఉన్న ఈ ‘సాఫ్ట్ పవర్’ ఎంతో ఆకర్షణను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా, అమెరికా ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా, సంక్షేమ రాజ్యంగా, సాంకేతిక విజ్ఞానంలో లీడర్‌గా ప్రశంసలు అందుకుంది. తద్వారా అమెరికా సంస్కృతికి, ఫ్యాషన్లకు విస్తృతంగా అనుకరణలు ప్రారంభం అయ్యాయి. ఈ కారణంగా ఇతర అగ్ర రాజ్యాల విధానాలలో లేని పరోపకార ధోరణి అమెరికా విధానాలలో ఉందనే అభిప్రాయం కూడా ఏర్పడింది.
కానీ నేడు ఇవన్నీ తిరగబడుతున్నాయి. ట్రంప్ పాలనలోని ‘అమెరికా ఫస్ట్’ విధానం అమెరికా ప్రయోజనాలనే అన్నింటికంటే ముందు ఉంచడానికి ప్రయత్నిస్తుంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తీర్పును రద్దు చేయడానికి లేదా కళంకం లేని న్యాయ వ్యవస్థపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నం ప్రజా స్వామ్యంలోని ముఖ్యమైన వ్యవస్థలను దుర్బలం చేసింది.
అమెరికాలో విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా తోపాటు చర్చిలు కూడా నేడు దాడికి గురవుతున్నాయి. ఇవన్నీ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) ఉద్యమం డిమాండ్లకు అనుగుణంగా ఉండాలన్న సంకేతాలను ఆయన పంపుతున్నారు. వైట్ హౌస్ ఆదేశాల ఉల్లంఘనలకు గాను విశ్వవిద్యాలయాలు డబ్బును తిరిగి చెల్లించాలని ట్రంప్ బెదిరించడం అమెరికన్ సంస్కృతిని వర్ణించే మేధా పరమైన స్వేచ్ఛను దెబ్బతీస్తుంది. నిజంగా ఉన్నాయో, లేవో తెలియని గ్రహాంతరవాసుల మాదిరిగా ట్రంప్ పరిపాలన విదేశీయులు, వీసా హోల్డర్లు, పర్యాటకులు, శాశ్వత నివాసితులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ల జీవితాన్ని కష్టతరం చేస్తోంది. ఈ చర్యలు అమెరికన్ ‘సాఫ్ట్ పవర్’ గుండెకాయపైనే దాడి చేస్తాయి.
అమెరికా సాఫ్ట్ పవర్‌ను చూసి ప్రపంచం అసూయ చెందేది. కానీ నేడు, షాంఘై, బీజింగ్‌లు కూడా ‘బ్రాడ్‌వే’ తరహా సాంస్కృతిక కేంద్రాలను కలిగి ఉన్నాయి. సంస్కృతితో పాటు కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లు, స్కాలర్‌షిప్‌ల ద్వారా చైనీస్ భాషను ప్రోత్సహించ డానికి విద్యార్థులను చైనా ఆకర్షిస్తోంది. ఇది సాఫ్ట్ పవర్ మరొక లక్షణం. భారతదేశం సంక్లిష్టమైన విదేశాంగ విధాన సవాళ్లను అధిగ మించడానికి సాఫ్ట్, హార్డ్ పవర్ మిశ్రమాన్ని ఉపయోగిస్తోంది.
దాంతో భారత్ విదేశీ విద్యార్థులకు ప్రధాన గమ్యస్థానం అయింది.ఈ హైపర్–రియలిస్ట్ యుగంలో సాఫ్ట్ పవర్ ఏమంత ముఖ్యం కాదని చెప్పడం సులభమే. కానీ వాస్తవం ఏమిటంటే, హార్డ్ పవర్ దానికదిగా... సాఫ్ట్, హార్డ్‌లు కలిసిన ‘స్మార్ట్ పవర్‘ సాధించగల సామర్థ్యాన్ని పొందలేదు. లేకుంటే, చైనా లేదా రష్యా... ప్రపంచంలో అత్యంత వాంఛనీయమైన దేశాలుగా పరిగణన పొందేవి. నిజానికి ధనిక దేశాలకు, లేదా మధ్య ఆదాయ దేశాలకు, అమెరికా ఇష్టమైన ఎంపిక! ఎందుకంటే తమ జీవితాలను మెరుగుపరచుకోవాలని కోరుకునే లక్షలాది వలసదారులకు అమెరికానే అనువుగా ఉంది.
ట్రంప్ అధికారంలో ఉన్నప్పటికీ సినిమాలు, సంగీతం, సాంకేతికత ద్వారా అమెరికా ప్రపంచవ్యాప్తంగా తన ప్రాధాన్యాన్ని నిలుపుకొనే అవకాశం ఉంది. కానీ మిత్రదేశాల విశ్వాసాన్ని తక్కువగా అంచనా వేయడం అగ్రరాజ్యానికే దెబ్బ. అలాగే, అమెరికా విలువలు, లక్ష్యాల పట్ల ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని మార్చడం కూడా ఆ దేశానికే నష్టదాయకం. వీటన్నిటి వల్ల ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ విధానం ప్రపంచంలో అమెరికాకు ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
మనోజ్ జోషీ
వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్