అధికారంలోని వారి అజ్ఞాన ఫలితం | Sakshi Guest Column On Vijayawada Floods and AP Govt | Sakshi
Sakshi News home page

అధికారంలోని వారి అజ్ఞాన ఫలితం

Published Wed, Sep 11 2024 12:04 AM | Last Updated on Wed, Sep 11 2024 12:06 AM

Sakshi Guest Column On Vijayawada Floods and AP Govt

అభిప్రాయం

రెండు ఆబ్జెక్ట్స్‌ ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో ప్రవేశించే ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్‌ జరుగుతుందనేది ఫిజిక్స్‌ సూత్రం. మనుషులు సామాజిక జీవితంలోనూ తరచూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. పాపం వాళ్ళకు యాక్సిడెంట్‌ సూత్రం తెలీక పోవచ్చు. కానీ, అత్యంత బాధ్యతగల పదవుల్ని నిర్వహిస్తున్న వారికి తెలియాలిగా? తెలియకపోతే విజయవాడ ముంపు లాంటి విషాదాలే జరుగుతాయి. 

ప్రకాశం బ్యారేజిని కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు రెండు దశల్లో నిర్మించాయి. ఇప్పటి ప్రకాశం బ్యారేజికి  కొన్ని అడు గులు దిగువన బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ నిర్మించిన ‘బెజవాడ ఆనకట్ట’ వుండేది. దీన్ని 1852లో మొదలెట్టి 1855లో పూర్తిచేశారు. ఆ ఆనకట్టను కెప్టెన్‌ ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ డిజైన్‌ చేయగా, మరో కెప్టెన్‌ ఛార్లెస్‌ అలెగ్జాండర్‌ ఆర్ర్‌ నిర్మించాడు. ఒక శతాబ్ద కాలం సమర్థంగా పనిచేసిన కాటన్‌–ఆర్ర్‌ ఆనకట్ట 1952 సెప్టెంబరులో కూలిపోయింది.  

అప్పుడు ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేది. సి.రాజగోపాలాచారి ముఖ్య మంత్రి. అప్పుడే ఆం్ర«ధలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతోంది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టడంతో రాజకీయం వేడెక్కింది. ఈ సంక్షోభ సమయంలో మద్రాసు ప్రభుత్వం, బెజవాడ ఆనకట్ట కూలిపోవడాన్ని పట్టించుకోలేదు. 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.  

కొత్త రాష్ట్రం; చిన్న రాష్ట్రం; నిధుల కొరత వున్న రాష్ట్రం. అయినా సరే పాత ఆనకట్ట స్థానంలో భారీ బరాజ్‌ కట్టాలని తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నడుం బిగించారు. పాత ఆనకట్ట ఆయకట్టు కన్నా మూడురెట్లు ఎక్కువ – అంటే దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు, డెల్టా గ్రామాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ వద్ద కృష్ణానది వరద గరిష్ఠంగా 12 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుందని 175 యేళ్ళ క్రితం ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ అంచనా వేశాడు. దాన్ని తగ్గించడం కుదరదు. అలా 12 అడు గుల ఎత్తు క్రస్ట్‌ గేట్లతో ఒక భారీ డిజైనింగ్‌ రూపుదిద్దుకుంది.  

బరాజ్‌ నిర్మాణ కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా ఆంధ్రా ప్రాంతానికి తెలంగాణా కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి హయాంలో 1957లో బరాజ్‌ నిర్మాణం పూర్త యింది. మూడు రాష్ట్రాలు నలుగురు ముఖ్యమంత్రులు మారినా అంతటి నిర్మాణం మూడేళ్ళలో (1954–57) పూర్తయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా చిత్తశుద్ధి తగ్గినందున భారీ బరాజ్‌ల నిర్మాణానికి దశాబ్దాలు పడుతోంది.  

సాంకేతికంగా ప్రకాశం బరాజ్‌ నిర్మాణంలో ఒక మెలిక వున్నది. వర్షాకాలంలో మాత్రమే బరాజ్‌కు నీరు వచ్చి చేరుతుంది. వేసవిలో ఎగువ నుండి నీరు రావు. బరాజ్‌ రిజర్వాయర్‌లో నిల్వవుండే మూడు టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడేవారు. నది ఎండిపోయినపుడు క్రస్ట్‌ గేట్లకు మరమ్మత్తులు చేసేవారు. జలాశయంలో చేరిన మేటను తొలగించే వారు. ఇప్పుడయితే నీరుండగానే గేట్లు మార్చే ‘స్టాప్‌ లాగ్‌ గేట్ల’ సౌకర్యం వచ్చింది.   

సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చినట్టు విజయవాడ సమీపంలో థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వీటీపీఎస్‌) రావడంతో ప్రకాశం బరాజ్‌కు ముప్పు మొదలైంది. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుల్లో వేడి నీటిని చల్లార్చి మళ్ళీ వాడటానికి వీలుగా కూలింగ్‌ టవర్స్‌ను ఏర్పాటు చేయాలి. వీటీపీఎస్‌ నేరుగా కృష్ణా నదిని కూలింగ్‌ యూనిట్‌గా మార్చుకుంది. అందుకు అనువుగా కృష్ణానది నుండి వీటీపీఎస్‌కు ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో కాలువలు నిర్మించారు. ఇన్‌ ఫ్లో కాలువ లోనికి కృష్ణానది నీరు పారాలంటే (గ్రావిటీ ఫ్లో) రిజర్వాయర్‌ నీటి మట్టాన్ని పూర్తి స్థాయిలో (ఎఫ్‌ఆర్‌ఎల్‌) నిరంతరం నిండుగా వుంచాల్సి వచ్చింది.    

ఒక ప్రత్యేక లక్ష్యం కోసం నిర్మించిన బరాజ్‌ను వేరే లక్ష్యంతో నిర్మించిన వీటీపీఎస్‌తో లంకె పెట్టడం పొరపాటు. ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో రెండు ఆబ్జెక్ట్స్‌ ప్రవేశించాయి. దీనివల్ల నాలుగు ప్రమాదాలు జరిగాయి. జలాశయాన్ని నిరంతరం నిండుగా వుంచాల్సి రావడంతో వేసవిలో దిగువ గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యం కాలేదు. వేసవిలో క్రస్ట్‌ గేట్లకు మరమ్మత్తులు చేపట్టడం కుదరలేదు. బరాజ్‌ పిల్లర్లు, క్రస్ట్‌ గేట్లు నీటిలో ఎలా వున్నాయో కనీసం పరిశీలించడానికి వీలు కాలేదు. మేటను తీయడం సాధ్యం కాకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.  

ప్రకాశం బరాజ్‌ బలం తగ్గుతోందనే భయాలు 1980ల లోనే మొద లయ్యాయి. వీటీపీఎస్‌తో లింకు తెగ్గొట్టాలని ఆయకట్ట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సమస్యకు పరిష్కారంగా వీటీపీఎస్‌కు ఇన్‌–ఫ్లో కెనాల్‌ కోసం బరాజ్‌ ఎగువన పంపింగ్‌ స్టేషన్‌ నిర్మించారు. ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నకు దారితీస్తుంది అనేది జ్ఞాన సూత్రం. ఒక సమస్యకు పరిష్కారం మరో సమస్యకు దారితీయడం అజ్ఞాన సూత్రం. అలాంటిది వీటీపీఎస్‌ ఔట్‌ ఫ్లో (కూలింగ్‌) కెనాల్‌ విషయంలో జరిగింది.  

ఆ వివరాల్లోనికి వెళ్ళడానికి ముందు బుడమేరు చరిత్రను పరిశీలించాలి. అదొక చిన్న వాగు. తరచూ నీళ్లు లేక ఎండిపోయి వుంటుంది. ఏరు మార్గం త్రాచుపాములా మెలికలు తిరిగి వుంటుంది. నేరుగా వెళితే 10 కిలోమీటర్లు కూడా లేని దూరాన్ని మెలికలతో 33 కిలోమీటర్లు సాగుతుంది. అలా కిందికి పోయి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలోనో, కృష్ణాజిల్లా వాయవ్య ప్రాంతంలోనో భారీ వర్షాలు కురిసినపుడు బుడమేరుకు అకస్మిక వరదలు వస్తాయి. వరద రోజుల్లో బుడమేరులో 20 వేల క్యూసె క్కుల వేగంతో నీరు పారుతుందని అంచనా. ఈ వేగానికి వాగు మెలికలు తట్టుకోలేవు గనుక గట్లు తెగి నీరు విజయవాడ మీద పడుతుంది. అందుకే బుడమేరుకు ‘విజయవాడ దుఃఖదాయని’ అని ఓ చెడ్డ పేరుంది.   

1960లలో విజయవాడ కృష్ణలంకను వరద ముంచేసినపుడు ఆ బాధి తులకు పట్టణ శివార్లలో పునరావాసం కల్పించారు అప్పటి మునిసిపల్‌ కమిషనర్‌ అజిత్‌ సింగ్‌. అలా ఆయన పేరున సింగ్‌ నగర్‌ ఏర్పడింది. నగరం విస్తరించే కొద్దీ సింగ్‌ నగర్‌ కూడా అనేక పేర్లతో విస్తరించింది. విచిత్రం ఏమంటే ఆ పరిసరాలన్నీ బుడమేరు పరివాహక ప్రాంతం. దాని అర్థం ఏమంటే కృష్ణా ముంపు బాధితులు బుడమేరు ముంపు బాధితులుగా మారారు.  

అంతిమంగా నీతి ఏమంటే, ఇళ్ళకు నీరు కావాలిగానీ, ఇళ్ళ లోనికి నీరు రాకూడదు. ఇళ్ళూ నీళ్ళూ ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో వుండడం అస్సలు కుదరదు. నీటిలో ఇళ్ళు కట్టినా, ఇళ్ళ లోనికి నీరు వచ్చినా విపత్తు తప్పదు.  


డానీ 
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్టు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement