
సందర్భం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 1925లో విజయ దశమి పర్వదినాన నాగపూర్‌లో స్థాపితమయ్యింది. నేడు శత వసంతాలు జరుపుకొంటున్న ఈ సంస్థను డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) నాగపూర్‌లో స్థాపించారు. ఇదే నగరంలో ఆయన 1889 ఉగాది రోజున జన్మించారు. ప్లేగ్ వ్యాధి వల్ల చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయి వీధిన పడ్డారు. అయినా కష్టపడి చదివారు. నాగపూర్‌లోని నీల్ సిటీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒక బ్రిటిష్ అధికారి స్కూల్ పర్యవేక్షణకు వచ్చినప్పుడు చిన్నారి కేశవుడు ‘వందేమాతరం’ అని నినదించాడు. దీంతో కేశవుని స్కూల్ నుంచి బహిష్కరించారు. తర్వాత యవత్‌మాల్‌లోని రాష్ట్రీయ విద్యా లయంలో చేరి పాఠశాల విద్యను పూర్తి చేశారు.
మాతృభూమిని విదేశీయుల కబంధ హస్తాల నుంచి తొలగించడానికి కలకత్తాలోని సాయుధ విప్లవకారులతో కలిసి పని చేయాలని భావించి 1910లో కలకత్తా (Kolkata) మెడికల్ కళాశాలలో చేరారు. విప్లవకారులైన శ్యామ్ సుందర చక్రవర్తి, మోతీలాల్ ఘోష్ వంటి వారితో కలిసి ‘అనుశీలన సమితి’ ద్వారా దేశ స్వాతంత్య్రానికి కృషి చేశారు. 1914లో మెడికల్ విద్యను పూర్తి చేసిన తర్వాత బ్యాంకాక్‌లో మంచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే జీవితాన్ని దేశ సేవకే అంకితం చేయాలని అప్పటికే నిర్ణయించుకున్నందు వలన ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు.
నాగపూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత లోకమాన్య తిలక్ స్థాపించిన ‘రాష్ట్ర సేవ మండల్’లో చేరి శివాజీ జయంతి, గణేష్ ఉత్సవం, శాస్త్ర పూజ, సంక్రాంతి మహోత్సవం వంటి కార్యక్రమాలను ఉత్సాహంతో నిర్వహించేవారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాల్లో ఆయన చేసిన ప్రసంగాలకు ఆంగ్ల ప్రభుత్వం రాజద్రోహాన్ని మోపి ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించింది. అదేవిధంగా 1930లో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన సత్యాగ్రహానికి మద్దతుగా పాల్గొని తొమ్మిది నెలల జైలు జీవితాన్ని గడిపారు. మహాత్మా గాంధీ, మదన్ మోహన్ మాలవీయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అప్పాజీ జోషీ వంటి నాయకులను కలిసి సంఘ కార్యం ఆవశ్యకతను వారికి తెలియజేశారు. ‘సంఘ’ శాఖను వీక్షించిన మహాత్మా గాంధీ (Mahatma Gandhi) డాక్టర్‌జీతో ‘మీరు నిజంగానే ఒక అద్భుతమైన సంస్థను నిర్మించారు. నేను స్వయంగా చేద్దామనుకుంటున్న పనిని మీరు నిశ్శబ్దంగానే చేసేశారు’ అని పేర్కొన్నారు.
కాళ్లకు స్థానికంగా కుట్టిన చెప్పులు, ఒంటిపై సాధారణమైన ధోవతి, చొక్కా, కాలర్ ఉన్న కోటు, నెత్తి మీద ఎత్తుగా ఉండే టోపీ ఆయన వేషధారణ. తాను స్వీకరించిన మహాకార్యానికి సంపూర్ణంగా జీవితాన్ని అంకితం చేసేందుకు ఆయన ఆజన్మ బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఆసేతు హిమాచలం సంఘ కార్యాన్ని విస్తరింప చేయడానికి ప్రయాణం చేసేవారు. ఈ విధంగా చేస్తూ ఆయన అనారోగ్యం బారిన పడి 1940 జూన్ 21వ తేదీన యాభై ఒక్క సంవత్సరాల వయసులోనే అంతిమ శ్వాస విడిచారు.
చదవండి: ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?
ఆయన స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్ (RSS) నేడు దేశ విదేశాలలో విస్తరించింది. ఎటువంటి సభ్యత్వ నమోదూ లేకుండా దాదాపు కోటి మంది స్వయం సేవకులను, నలభై అయిదు లక్షల సంఘ శాఖలను, యాభై అనుబంధ సంఘాలను, ఐదు వేల మంది పూర్తి సమయ స్వయం సేవకులను (ప్రచారకులు) ఆర్‌ఎస్‌ఎస్ కలిగి ఉంది. భారతదేశంలోనే కాక అమెరికా, ఇంగ్లండ్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దాదాపు 50 దేశాలలో వివిధ రకాల పేర్లతో సేవా కార్యక్రమాలను ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తోంది.
- ప్రొఫెసర్ వై.వి. రామిరెడ్డి
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్
(మార్చి 30న ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ జయంతి)