First Time RSS History Woman Attend For Vijayadashami Event - Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్‌ చరిత్రలోనే తొలిసారిగా.. ఇంతకీ ఎవరామె?

Published Wed, Oct 5 2022 4:48 PM | Last Updated on Wed, Oct 5 2022 8:57 PM

First Time RSS History Woman Attend For Vijayadashami Event - Sakshi

నాగ్‌పూర్‌: తన సంప్రదాయంలో మార్పును సూచిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ పని చేసింది. పర్వతారోహ దిగ్గజం సంతోష్ యాదవ్ రూపంలో ఒక మహిళను బుధవారం జరిగిన RSS విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో ఈ ఈవెంట్‌ జరిగింది.

ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ప్రపంచంలోనే తొలి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు సంతోష్ యాదవ్. ఈ సందర్భంగా ఆరెస్సెస్‌ చీఫ్‌ భగవత్ మాట్లాడుతూ.. అన్ని ప్రదేశాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని సూచించారు. ‘‘స్త్రీని తల్లిగా భావించడం మంచిది. కానీ, తలుపులు బంధించి వాళ్లను పరిమితం చేయడం మంచిది కాదు. అన్ని చోట్లా నిర్ణయాలు తీసుకునేలా మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అభిప్రాయపడ్డారాయన. 

ఒక మగవాడు చేయలేని పనులను చేయగలిగే సామర్థ్యం స్త్రీ శక్తికి ఉంది.  అందువల్ల వాళ్లకు సాధికారత కల్పించడం, పని చేసే స్వేచ్ఛను ఇవ్వడం, పనిలో సమాన భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం” అని ఆయన అన్నారు. శాంతికి పునాది శక్తి. మహిళా ముఖ్య అతిథి హాజరు గురించి చాలా కాలంగా చర్చించుకుంటున్నాం అని ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తెలిపారు.

ఆరెస్సెస్‌ సీనియర్‌ కార్యకర్త దత్తాత్రేయ హోసబలే సంఘీ కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడంపై ఓ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆరెస్సెస్‌ అంటే మగవాళ్లకు మాత్రమే అని ముద్ర చెరిపేయాలని ఆయన కోరారట. ఈ తరుణంలో ఆయన అభ్యర్థనను పరిశీలనలకు తీసుకుని.. ఇప్పుడు సంతోష్‌ యాదవ్‌ను ఇలా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  

సంతోష్ యాదవ్.. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించారు. పర్వతారోహణలో ఆమె ఒక దిగ్గజం. ఎవరెస్ట్‌ పర్వతాన్ని రెండుసార్లు (1992, 1993లో) అధిరోహించిన తొలి మహిళగా ఈమె పేరిట ఒక రికార్డు ఉంది. అంతేకాదు కఠినమైన కాంగ్‌షుంగ్ ముఖం నుండి ఈమె ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మహిళగా గుర్తింపు దక్కించుకున్నారు. 

ఆరుగురు తోబుట్టువుల్లో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఆమె పోరాటం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ధైర్యసాహసాలు, ఇతరులకు సహాయం చేసే ఆమె మంచి మనసు కూడా చర్చించుకునే అంశమే. డిగ్రీ చదివే రోజుల్లో తన హాస్టల్‌ రూం నుంచి ఆరావళి పర్వతాలను అధిరోహిస్తున్న పర్వతారోహకులను చూసి ఆమె స్ఫూర్తిని పొందారు. 1992లో.. తన తోటి పర్వతారోహకుడైన మోహన్ సింగ్‌తో ఆక్సిజన్‌ను పంచుకోవడం ద్వారా ఆమె ఆయన ప్రాణాలను కాపాడగలిగారు.

ఎవరెస్ట్‌ను అధిరోహించేనాటికి ఆమె వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అతిచిన్న వయసులో ఎవరెస్ట్‌ సాహసం చేసిన ఘనత కూడా ఆమెదే. 2013లో మాలవత్‌ పూర్ణ పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించే వరకు ఆ రికార్డు సంతోష్‌ యాదవ్‌ పేరిట పదిలంగా ఉండిపోయింది. 

2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం సంతోష్‌ యాదవ్‌ను పద్మ శ్రీ పురస్కారం అందించి గౌరవించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement