
చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికాతో శత్రుత్వం, అంతర్జాతీయ ఆంక్షలు మరింత ముదరడంతో ఇరాన్ కరెన్సీ రియాల్ మారకం విలువ అత్యంత కనిష్టాలకు దిగజారింది. శనివారం అంతర్జాతీయ మార్కెట్లో ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఒక ఇరాన్ రియాల్ మారకం విలువ ఏకంగా 10,43,000కు పడిపోయింది. అంటే ఇరాన్ ప్రజలు ఒక్క అమెరికన్ డాలర్‌ను తమ సొంతం చేసుకోవాలంటే ఏకంగా 10,43,000 రియాల్ కరెన్సీలను కుమ్మరించాల్సిందే. ఇరాన్ రియాల్ మారకం విలువ ఇంతటి అత్యల్ప స్థాయికి పడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి.
పర్షియా నూతన సంవత్సరం నౌరూజ్ సందర్భంగా కరెన్సీ మారకం దుకాణాలను మూసేశారు. కానీ వీధుల్లో అనధికారికంగా దుకాణాలు నడిచాయి. దీంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రియాల్ విలువ మరింత దిగజారింది. శనివారం దుకాణాలు తెరిచాక విలువ మరింత పతనమై చివరకు 10,43,000 వద్ద ఆగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఫిర్దౌసీ మనీ ఎక్సే్ఛంజ్ మార్కెట్లో కొందరు వ్యాపారులు తమ ఎల్రక్టానిక్ సైన్‌బోర్డులను స్విచ్ఛాఫ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఉంటే ఇంకెంత పతనమవుతోందోనన్న భయంతో వాటిని ఆఫ్ చేశామని రేజా షరీఫ్ అనే ఎక్సే్ఛంజ్ వ్యాపారి చెప్పారు.
రియల్ శక్తిని మరింత పీల్చేసిన పరిస్థితులు
2018లో తొలిసారిగా అమెరికా అధ్యక్షునిగా ఉన్నకాలంలో ఇరాన్‌తో అణ్వాయుధ ఒప్పందం నుంచి ట్రంప్ సర్కార్ వైదొలిగాక ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత పెరిగింది. 2015లో తొలిసారిగా అమెరికాతో అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తగ్గించుకుంది. యురేనియం నిల్వలను పెంచుకునే వేగానికి కళ్లెం వేసింది. ఆ కాలంలో డాలర్‌తో రియాల్ మారకం విలువ 32,000 స్థాయిలో కొనసాగేది.
ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా గెలిచాక ఆంక్షల చట్రంలో ఇరాన్‌ను బంధించారు. దీంతో మారకం జారుడుబల్లపై రియాల్ మరింత కిందకు జారింది. నేరుగా చర్చలకు సిద్ధమని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీకి ట్రంప్ లేఖ రాయడం, దానిని ఖమేనీ తిరస్కరించడం తెల్సిందే. మధ్యవర్తిత్వ చర్చలకే తాము మొగ్గుచూపుతామని ఖమేనీ స్పష్టంచేశారు. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న యెమెన్ హౌతీలను అమెరికా వాయుసేనలు లక్ష్యంగా చేసుకోవడంతో ఇరాన్, అమెరికా బంధంలో బీటలు మరింత పెద్దవయ్యాయి.