
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బ్రిక్స్ (BRICS) దేశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్ విలువను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవని, బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని స్పష్టం చేశారు.
ఇతర దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించలేవు.. శక్తివంతమైన యూఎస్ డాలర్‌ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి ప్రయత్నాలు జరిగితే.. 100 శాతం టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యంలో యూఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించే ఏ దేశంపైనైనా వంద శాతం సుంకాలు విధించడానికి వెనుకాడమని అన్నారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లతో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బ్రిక్స్.. అంతర్జాతీయ వాణిజ్యం కోసం యూఎస్ డాలర్‌కు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తోంది. అయితే సుంకాలను ఆహ్వానించాలని అనుకుంటే.. అమెరికాకు వీడ్కోలు చెప్పవచ్చు అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా.. అమెరికా డాలర్ నుండి వైదొలగాలనే ఆలోచన లేదు. బ్రిక్స్ కరెన్సీ కోసం ప్రస్తుత ప్రతిపాదనలేవీ కూడా లేవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదం
యూఎస్ డాలర్ ప్రపంచ వాణిజ్యంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది ప్రపంచంలో 90 శాతం కంటే ఎక్కువ లావాదేవీలను కలిగి ఉంది. యూఎస్ డాలర్ తరువాత జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్ వంటి ఇతర కన్వర్టిబుల్ కరెన్సీలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాగా వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి.. ఒకే కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రిక్స్ కరెన్సీ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది కొన్ని దేశాలు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం.