
ఐరాస నివేదిక ప్రశంసలు
70 శాతం తగ్గిన మరణాలు
61 శాతం తగ్గిన నవజాత శిశు మరణాలు
ఐరాస: శిశు మరణాలను అరికట్టడంలో భారత్ ప్రయత్నాలు, పురోగతిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఐక్యరాజ్యసమితి ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టలిటీ ఎస్టిమేషన్ ఇటీవల నివేదికను విడుదల చేసింది. శిశు మరణాలను తగ్గించిన ఐదు ‘ఆదర్శవంతమైన దేశాల’ను, నివారించదగిన శిశు మరణాలను తగ్గించడంలో పురోగతి కోసం వాటి వ్యూహాలను ఉదాహరించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా పలు అల్ప, మధ్య ఆదాయ దేశాలు ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను 2000 నుంచి బాగా తగ్గించగలిగాయి. భారత్‌తో పాటు అంగోలా, భూటాన్, బొలీవియా, కాబో వెర్డే, మొరాకో, సెనెగల్, టాంజానియా, జాంబియా శిశు మరణాలను మూడింట రెండొంతులు తగ్గించగలిగాయి’’ అని నివేదిక పేర్కొంది.
వ్యూహాత్మక పెట్టుబడులతో ..
ఆరోగ్య వ్యవస్థపై వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా భారత్ ఇప్పటికే లక్షలాది శిశువుల ప్రాణాలను కాపాడిందని ఐరాస నివేదిక పేర్కొంది. 2000 నుంచి చూస్తే ఐదేళ్లలోపు శిశువల మరణాల్లో 70 శాతం తగ్గింపును, నవజాత శిశు మరణాల్లో 61 శాతం తగ్గింపును సాధించిందని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని కొనియాడింది.
‘‘ఇందులో భాగంగా ప్రతి గర్భిణీ ఉచిత ప్రసవానికి అర్హురాలు. శిశు సంరక్షణ, ప్రజారోగ్య సంస్థల్లో ఉచిత రవాణా, మందులు, రోగనిర్ధారణ, ఆహార మద్దతును అందిస్తున్నారు. సమగ్ర కవరేజీ, ఆరోగ్య సేవల అమలుకు ప్రసూతి వెయిటింగ్ హోమ్స్, మాతా శిశు ఆరోగ్య విభాగాలు, నవజాత శిశు స్థిరీకరణ యూనిట్లు, అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు సంరక్షణ యూనిట్లు, తల్లి సంరక్షణ యూనిట్లు, జనన లోపాల స్క్రీనింగ్కు ప్రత్యేక కార్యక్రమం, మౌలిక సదుపాయాల బలోపేతం తదితరాలు కూడా ప్రశంసనీయం. ఫలితంగా ఏటా లక్షలాది మందికి ఆరోగ్యకర గర్భధారణ సాధ్యమవుతోంది. బిడ్డలు ఆరోగ్యంగా పుడుతున్నారు. మాతాశిశు ఆరోగ్య సేవలకు మంత్రసానులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నియామకం, శిక్షణ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. డేటా వ్యవస్థలు, మాతా, నవజాత శిశువు, శిశు ఆరోగ్య సూచికలను ఎప్పటికప్పుడు డిజిటైజ్ చేస్తున్నారు. భిన్న భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య వ్యవస్థ నిర్మాణాలున్నా భారత్ (India) ఈ ఘనత సాధించింది’’అని ప్రశంసించింది.
చదవండి: అర్ధశతాబ్దం భూగర్భంలో.. నేడు కళ్లు చెదిరే ధరలో!
‘‘భారత్‌లో 2000 నాటికి ఐదేళ్లలోపు శిశువుల్లో కేవలం 56 శాతం మందికే తట్టు టీకాలు వేసేవారు. దాంతో ఏకంగా 1,89,000 మంది శిశువులు తట్టుతో మరణించారు. 2023 నాటికి 93 శాతం శిశువులకు తట్టు టీకా (Vaccine) వేశారు. దాంతో తట్టు మర ణాలు 97 శాతం తగ్గి 5,200కు పరిమితమయ్యాయి. వ్యాక్సిన్లు, పోషకాహారం, సురక్షితమైన నీరు, ప్రాథమిక పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిబద్ధత వల్ల లక్షలాది మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి’’ అని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ రస్సెల్ ప్రశంసించారు. శిశు మరణాలను భారత్ రికార్డు స్థాయికి తగ్గించడం గొప్ప విషయమన్నారు.