
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాసిపేట: మండలంలోని పెద్దనపల్లి నాయకపుగూడకు చెందిన మేసినేని మల్లు(53) అనే మహిళ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కాసిపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం మల్లు ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు బెల్లంపల్లి, మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రులకు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. ముఖం మీద పుండు కావడంతో నొప్పి తగ్గక మద్యానికి అలవాటు పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆమె భర్త రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దండేపల్లి మండలంలో..
దండేపల్లి: మండలంలోని గూడెం గ్రామానికి చెందిన ముత్తినేని మొండయ్య(42) చికిత్స పొందుతూ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం మృతిచెందాడు. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మొండయ్య భార్య పద్మ గత రెండు నెలల క్రితం అతడిని విడిచి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉండలేక జీవితంపై విరక్తి చెంది గత నెల 29న పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించి చనిపోయాడు. మృతుడి మేనమామ ఉగ్గె రాజలింగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.