
ఆలసించిన ఆశాభంగమే!
పురజనుల వేడుకోలు వలన కొద్ది రోజులు మాత్రమే హెచ్చింపబడినది. తెనుగు టాకీల కనులారా వీక్షించి జన్మము సార్థకము చేసికొనుడు. అనేకులకు టిక్కెట్లు దొరకక
వెనుకకు మరలిపోవలసి వచ్చుచున్నది.
– దుర్గా కళా మందిరం, బెజవాడ.
(93 ఏళ్ల క్రితం, ఆనాటి పత్రికల్లో వచ్చిన ఒక సినిమా ప్రకటన ఇది).
∙∙
ఈ మాటాడు చిత్రమును చూడని వారి జన్మ నిరర్థకము. ఒకవేళ మీకు తెలుగు భాషయందు ప్రవేశము లేకున్నను, ఒక దఫా వచ్చి కనులార గాంచవలసిందే. – సెలక్టు పిక్చర్సు సర్‌క్యూట్స్, బెంగుళూరు. (ఇది కూడా అదే సినిమాకు సంబంధించిన వాల్ పోస్టర్ ప్రకటన).
ఆ సినిమా : శ్రీరామ పాదుకా పట్టాభిషేకము! శ్రీరాముడి పాత్ర ఉన్న తొలి తెలుగు టాకీ చిత్రం. సినిమాల్లో ఇప్పటికీ శ్రీరాముడంటే శ్రీ నందమూరి తారక రామారావు అన్నట్లుగానే ఉంటుంది. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తే– ఆయన ఆ పాత్రలో కాక, ఏకంగా శ్రీరాముడిలోనే ఒదిగిపోయారా అన్నట్లుగా ఉంటుందని ఆయన అభిమానులు అంటారు.
శ్రీ రాముడిగా ఎన్టీఆర్ తొలి సినిమా ‘సంపూర్ణ రామాయణం’ (1958). రెండోది లవకుశ (1963), మూడు రామదాసు (1964), నాలుగు శ్రీరామాంజనేయ యుద్ధం (1975), ఐదు శ్రీరామ పట్టాభిషేకం (1978). ఎన్టీఆర్ కంటే ముందు అక్కినేని నాగేశ్వరరావు; ఎన్టీఆర్ తర్వాత హరనాథ్, శోభన్‌బాబు, కాంతారావు, రవికుమార్, శ్రీకాంత్, సుమన్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ శ్రీరాముడి పాత్రల్లో కనిపించారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు, ఏఎన్నార్ కంటే కూడా ముందు... తొలిసారి తెలుగు తెర మీద ప్రత్యక్షమైన రాముడొకరు ఉన్నారు. ఆయనే యడవల్లి సూర్యనారాయణ!
∙∙
‘జననానికి’ ముందే ‘పట్టాభిషేకం’
తెలుగులో తొలి మాటల చిత్రం (టాకీ) ‘భక్త ప్రహ్లాద’ అయితే రెండో టాకీ చిత్రం ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. రెండూ ఒకే ఏడాది పూర్తయ్యాయి. భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరిలో, శ్రీరామ పాదుకా పట్టాభిషేకం 1932 డిసెంబరులో విడుదలయ్యాయి. ఈ రెండో చిత్రంలోనే రాముడిగా నటించారు యడవల్లి సూర్యానారాయణ. అంటే, ఏఎన్నార్ రాముడిగా నటించిన ‘సీతారామ జననం’ (1944) చిత్రానికి పన్నెండేళ్లకు ముందు, ఎన్టీయార్ తొలిసారి రాముడిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి 26 ఏళ్లకు ముందే ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’లో రాముడి పాత్రను పోషించి, తెలుగు టాకీ తొలి రాముడిగా ప్రఖ్యాతిగాంచారు యడవల్లి.
∙∙
యువ దర్శకుడి చేతిలో తొలి రాముడు
‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రాన్ని బాదామి సర్వోత్తమ్ దర్శకత్వంలో సాగర్ స్టూడియోస్ వారు నిర్మించారు. సీతగా సురభి కమలాబాయి నటించారు. రాముడు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చేవరకు, సింహాసనంపై రాముడి పాదుకలను (పాదరక్షలను) ఉంచి భరతుడు రాజ్యపాలన చేయటమే ఈ చిత్ర కథాంశం. బాదామి సర్వోత్తమ్ (1910–2005) ఇరవై ఏళ్ల వయసులో ముంబైలోని ‘సాగర్ మూవీ టోన్’ కంపెనీలో పని చేస్తూ ఆ స్టూడియో వాళ్లు నిర్మించిన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ సినిమాలలో తొలి టాకీ చిత్రాలకు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహిస్తే, రెండు భాషల్లోనూ తర్వాతి చిత్రాలకు బాదామి సర్వోత్తమ్ దర్శకత్వం వహించారు. ఇరవై రెండేళ్ల వయసుకే ఆయనకు ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.
సీతమ్మగా ‘కమలమ్మ’
‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ చిత్రంలో సీతగా నటించే నాటికి సురభి కమలాబాయి వయసు 25 ఏళ్లు. తొలి తెలుగు సినిమా నటి. గాయని. 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’లో లీలావతి పాత్రను ధరించారు. రంగస్థల కుటుంబంలో జన్మించిన కమలాబాయి బాల్యంలో కృష్ణుడిగా, ప్రహ్లాదుడిగా నటించారు. కౌమార దశ దాటాక మగ పాత్రలు వేయటం మాని, మహిళల పాత్రలలోకి వచ్చేశారు. కమలాబాయి నటనా ప్రతిభ గురించి విని సాగర్ స్టూడియోస్ వాళ్లే ఆమెను సగౌరవంగా బొంబాయి ఆహ్వానించారు. ఆ స్టూడియో ఆర్టిస్ట్‌గా కమలాబాయి పదేళ్ల పాటు అక్కడే ఉండి, వారు నిర్మించిన అనేక సినిమాలలో నటించారు.
∙∙
రాముడి పాత్ర ‘సాగర్’ ఇచ్చిందే
తొలి తెలుగు సినీ రాముడు యడవల్లి సూర్యనారాయణ (1888–1939) కూడా రంగస్థలం నుంచి వచ్చినవారే. సినిమాల్లోకి రాకముందు రంగస్థలంలో ఆయన సూపర్ స్టార్. వివిధ నాటక సమాజాలతో ఉన్న సత్సంబంధాలున్న వారి ప్రోత్సాహంతో ఆయన కూడా సాగర్ మూవీటోన్ గ్రూప్ వారి ప్రతిష్ఠాత్మక యాక్టర్ అయిపోయారు. ‘పాదుకా పట్టాభిషేకంలో’ శ్రీరాముడి పాత్రకు ఎంపికయ్యారు. సినిమాల్లోకి వచ్చేసరికి యడవల్లి వయసు 46 ఏళ్లు. అప్పట్నుంచి మూడేళ్లు సినిమాల్లో ఉండి, తిరిగి నాటక రంగంవైపు వచ్చారు.