
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారు పెళ్లి ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నారట. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళ్‌లోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇక్కడ 'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్‌లో ఆమె బోల్డ్‌గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి.
అభినయ, సన్నీ వర్మల వివాహాం ఏప్రిల్ 16న జరగనున్నట్లు తెలుస్తోంది. ఆమె సన్నిహితులకు ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారట. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్‌లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. అభినయ పుట్టుకతోనే మాటలు రావు, వినిపించవని తెలిసిందే. అయినప్పటికీ తన టాలెంట్‌తో సినిమాల్లో రాణించింది. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు సన్నీ వర్మతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది. అతనికి కూడా పుట్టుకతోనే మాటలు రావని ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు. అయితే, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఆమె ఇటీవలే నిశ్చితార్థం సమయంలో తీసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినయ పంచుకుంది. తనకు కాబోయే భర్తను ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది. ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబం కూడా వ్యాపార రంగంలో ఉందని సమాచారం.