
మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కుంచకో బోబన్. మాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇటీవలే సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. అయితే మలయాళంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన కుంచకో బోబన్.. ఇతర భాషల్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ విషయంపై ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటివరకు మలయాళం కాకుండా మరే ఇతర భాషలో ఎందుకు పని చేయలేదన్న ప్రశ్నపై స్పందించారు.
కుంచకో బోబన్ మాట్లాడుతూ.. 'నేను నిరంతరం నా క్రాఫ్ట్ గురించి నేర్చుకుంటూనే ఉంటా. నన్ను మరింత మెరుగుపరుచుకుంటున్నా. ప్రస్తుత రోజుల్లో కంటెంట్ పరంగా చూస్తే మలయాళ చిత్ర పరిశ్రమ మంచి దశలో ఉందని అనుకుంటున్నా. నిజానికి మలయాళంలో విడుదల చేస్తున్న విభిన్నమైన చిత్రాలను చూసి ఇతర పరిశ్రమలు అసూయపడుతున్నాయి. ఎందుకంటే మా చిత్రాల్లో నాణ్యత, ఇతివృత్తం, కథ కూడా కారణం కావొచ్చు. మా సినిమాలు స్థానికంగా తీస్తున్నప్పటికీ పాన్-ఇండియా, గ్లోబల్ రేంజ్‌కి మారిపోతున్నాయి. ఇప్పుడు మలయాళంలో రూపొందుతున్న సినిమాలు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటున్నాయి. అయితే ఇతర భాషల్లోనూ నటించేందుకు అసక్తిగా ఉన్నా. కానీ ప్రత్యేకించి తమిళంలో ఏదైనా ఒక అద్భుతమైన పాత్ర వచ్చినట్లయితే కచ్చితంగా చేస్తా. అలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నా' అని అన్నారు.