మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక సంచలనంగా మారింది. పలువురు నటులు, డైరెక్టర్లపై ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మలయాళ నటుడు జయసూర్య స్పందించారు. ఇలాంటి ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జయసూర్య ఖండించారు. ప్రస్తుతం తాను యూఎస్‌లో ఉన్నానని.. త్వరలోనే కేరళకు వస్తానని చెప్పారు.
ఆగస్టు 31న తన బర్త్ డేను జయసూర్య సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సులభమని.. అబద్ధం ఎల్లప్పుడూ నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుందని అన్నారు. కానీ చివరికీ నిజం గెలుస్తుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందన్నారు. నా పుట్టినరోజును ఇలాంటి సమయంలో జరుపుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.
కాగా.. జయసూర్య తనను లైంగికంగా వేధించారంటూ ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికే మలయాళ ఆర్టిస్టుల సంఘ సభ్యులు మోహన్‌లాల్‌తో సహా అందరూ రాజీనామాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment