
చిత్రం: టెస్ట్
నటీనటులు: ఆర్. మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్, కాళీ వెంకట్, నాజర్ తదితరులు
దర్శకత్వం: ఎస్.శశికాంత్
నిర్మాతలు: ఎస్.శశికాంత్, రామచంద్ర
సినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్
సంగీతం: శక్తిశ్రీ గోపాలన్
నిర్మాణ సంస్థలు: వైనాట్ స్టూడియోస్
స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్
భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం.. అందుకే ఈ ఆట చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి. టెస్ట్( Test) సినిమాలో కేవలం ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎంచుకుని అందులో క్రికెట్‌ను ప్రధాన అంశంగా జోడించి దర్శకుడు శశికాంత్ తెరకెక్కించాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో(Nayanthara) పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. తమిళ్,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
కథేంటంటే..
చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా కథ. సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కుముద (నయనతార ) ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకుంటుంది. కుముద భర్త శరవణన్ (ఆర్ మాధవన్) భారతదేశంలోనే బెస్ట్ సైంటిస్ట్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కుముద స్కూల్‌మేట్ అర్జున్ (సిద్ధార్థ్) స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ ఫామ్ కోల్పోయి భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా ముగ్గురు తమ కోరికలను ఎలాగైన సరే నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో వారి లైఫ్‌లోకి బెట్టింగ్ మాఫియా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఎవరు ఎలాంటి తప్పులు చేస్తారు అనేది దర్శకుడు చూపారు.
చెన్నైలో ఇండియా, పాక్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌తో వీరి ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉంటాయి. శరవణన్ సైంటిస్ట్‌గా తను కనుగొన్న ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం రూ. 50 లక్షలు అప్పు చేస్తాడు. కానీ, అది ముందుకు సాగదు. అర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో కుమదతో శరవణ్‌కు గొడవలు వస్తాయి. గొప్ప చదవులు పూర్తి చేసినప్పటికీ జీవితంలో ఏమీ సాధించలేని అసమర్థుడిగా మిగిలిపోతానేమో అనుకున్న శరవణన్.. అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. శరవణన్‌కు బెట్టింగ్ మాఫియాతో ఎలా లింక్ ఏర్పడుతుంది..? తన స్నేహితుడి కుమారుడిని కిడ్నాప్ చేసినా కూడా అర్జున్‌కు కుముద ఎందుకు చెప్పదు..? కుమారుడిని కూడా పనంగా పెట్టి అర్జున్ ఎందుకు ఆడుతాడు..? ఈ తతంగం అంతా పోలీసులు ఎలా పసిగడుతారు..? చివరకు ఈ ముగ్గురి జీవితాలు ఎలా ముగిసిపోతాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
దర్శకుడు కథ చెబుతున్నప్పుడు అద్భుతంగా అనిపించే నయనతార, సిద్దార్థ్, మాధవన్ ఒప్పుకొని ఉండొచ్చు. కానీ, స్క్రీన్‌పై స్టోరీ చూపించడంలో డైరెక్టర్ శశికాంత్ ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. మిడిల్‌క్లాస్ జీవితాలను చూపించే సమయంలో ఎమోషన్స్ లేకపోతే ఆ సీన్స్ పెద్దగా కనెక్ట్ కావు. ది టెస్ట్ సినిమాలో అదే ఫీల్ కలుగుతుంది. సినిమా టైటిల్, ట్రైలర్‌ను చూసిన వారందరూ కూడా ఈ మూవీ మరో జెర్సీ లాంటి స్పోర్ట్స్ డ్రామా, థ్రిల్లర్ సినిమానే అనుకుంటారు. కానీ, ఇందులో ఆ రెండూ బలంగా లేవు. కథలో భాగంగా ప్రతి పాత్రలో ఎక్కువ షేడ్స్ కనిపించేలా ఉండాలి. ఆపై ఆ పాత్రల చుట్టూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న తీరు ప్రేక్షకులకు దగ్గర చేయాలి. ఇవి ఏమీ ఇందులో ఉండవు.
అర్జున్ ఒక స్టార్ క్రికెటర్. అతనికి కుముద తండ్రి కోచ్‌గా ఉండేవాడని చెప్తారు. అయితే, కుముదతో ఉన్న బాండింగ్‌ను దర్శకుడు చూపిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆటగాడికి జట్టులో చోటు దక్కడం కష్టం అంటున్న సమయంలో బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసం శ్రమిస్తున్నట్లుగా ఒక్క సీన్ కూడా ఆర్జున్‌కు సంబంధించి వుండదు. చివరికి కొడుకుని కూడా పణంగా పెట్టి గ్రౌండ్‌లో అర్జున్ అడుగుపెడుతాడు. కానీ, తనకు క్రికెటే ముఖ్యం అనేలా దర్శకుడు చూపించలేకపోయాడు. దీంతో ఆర్జున్ ఆటకు ప్రేక్షకులు కనెక్ట్ కావడం చాలా కష్టం.
ఎవరెలా చేశారంటే..
టెస్ట్ సినిమాలో కాస్త పర్వాలేదు అనిపించే పాత్ర ఏమైనా ఉందంటే శరణన్ (మాధవన్) అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్‌లో ఆయన పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతారు. ఒక సైంటిస్ట్‌గా దేశం కోసం ఏదైనా చేస్తాను అనే పాత్రలో చక్కగా సెట్ అయ్యాడు. టెస్ట్ మ్యాచ్‌లా సాగుతున్న సినిమాను వన్డే ఆటలా మార్చేశాడు. విలన్, హీరో ఇలా రెండు షేడ్స్ ఆయనలో కనిపిస్తాయి. తన వరకు వస్తే ఒక మనిషి ఎంత అవకాశవాదో శరవన్ పాత్రలో దర్శకుడు చూపాడు. ఈ కోణంలో చూస్తే చాలామందికి నచ్చుతుంది. టెస్ట్ సినిమాలో సిద్దార్ధ్ పాత్రను ఇంకాస్త హైలెట్ చేసి చూపింటే బాగుండేది. ది టెస్ట్‌లో మంచి, చెడు, సంఘర్షణ, స్వార్ధం గెలుపు, ఓటమి ఇలా ఎన్నో షేడ్స్ ఉన్నాయి. కానీ, తెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు.