
ఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని లోక్‌సభ వేదికగా వైఎస్సార్‌సీపీ మరోసారి ఖండించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని, ఒరిజినల్ ఎత్తు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభలో జలశక్తి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు పలు ప్రాజెక్టుల అంశాలను కూడా అవినాష్ లేవనెత్తారు.
‘ ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం ఈసీని తిరస్కరించింది. రాయలసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం బాబు ప్రభుత్వం తగిన ఒత్తిడి చేయలేదు. వైఎస్ జగన్‌ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు మెజారిటీ పనులు పూర్తయ్యాయి. రాయలసీమ ఎత్తిపోతలతో 800 అడుగుల వద్ద రోజు మూడు టిఎంసిల నీరు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. లేదంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. ఓవైపు శ్రీశైలంలో 798 అడుగుల వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల వద్ద పాలమూరు- రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారు
ఈ పరిస్థితుల్లో 880 అడుగుల వరకు నీరు ఎప్పుడు వస్తుంది...రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లెప్పుడు వస్తాయి. గుండ్రేవుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల రిపేర్లు చేపట్టాలి. ఏపీకి జలజీవన్ మిషన్ కింద నిధులను పెంచాలి. నంద్యాల - కల్వకుర్తి మధ్య రివర్ ఓవర్ బ్రిడ్జితోపాటు ఆనకట్ట నిర్మించాలి’ అని అవినాష్ రెడ్డి కోరారు.