
రాంబిల్లిలో అణు జలాంతర్గాముల హబ్!
తూర్పు తీరంలో నూతన నౌకా స్థావరం
యుద్ధ నౌకల మకాం కూడా అక్కడే
వచ్చే ఏడాది కమిషన్
ఆంధ్రప్రదేశ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడు శ్రుతి మించుతున్న తరుణంలో డ్రాగన్ జోరుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ నడుం బిగిస్తోంది. తూర్పు నౌకాదళ కేంద్రమైన విశాఖపట్టణానికి దక్షిణంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాంబిల్లి గ్రామం. అక్కడ మన అణు జలాంతర్గాములు, యుద్దనౌకల కోసం వచ్చే ఏడాది కల్లా నూతన నౌకా స్థావరాన్ని ఉపయోగంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. మరోవైపు కర్ణాటకలో కార్వార్ నౌకా స్థావరం విస్తరణ పనులు కూడా ఊపందుకున్నాయి.
తద్వారా అటు తూర్పు తీరం, ఇటు పశ్చిమ తీరాల్లో ప్రాంతీయంగా పెరుగుతున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధమవుతోంది. దాడులు జరిపే అణు జలాంతర్గాములు (ఎస్ఎస్ఎన్), బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళ్లే న్యూక్లియర్ సబ్మెరైన్లు (ఎస్ఎస్బీఎన్) సహా మన అణు జలాంతర్గాముల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో వాటికి ఓ భద్రమైన నెలవు ఏర్పాటు చేసేందుకు ‘ప్రాజెక్టు వర్ష’లో భాగంగా అండర్ గ్రౌండ్ పెన్స్, సొరంగాల నెట్వర్క్ ఫీచర్లతో రాంబిల్లి స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
బంగాళాఖాతంలో అణు జలాంతర్గాములు గస్తీ తదితర రహస్య కార్యకలాపాలను నిర్వహించేందుకు పై ఫీచర్స్ ఉపకరిస్తాయి. హైనన్ దీవిలో చైనా అణు జలాంతర్గాముల స్థావరం మాదిరిగా రాంబిల్లి నౌకా స్థావరం కూడా... ఉపగ్రహాల కంటపడకుండా జలాంతర్గాములు లోతైన జలాల్లో రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది. బాలిస్టిక్ క్షిపణులను న్యూక్లియర్ సబ్మెరైన్లు గుట్టుగా మోసుకెళ్లడానికి ఇది తప్పనిసరి. 2014 నుంచి మొదలైన ‘ప్రాజెక్టు వర్ష’ తొలి దశ పూర్తి కావస్తోంది. ఇది 2026లో వినియోగంలోకి (కమిషన్) రావచ్చని భావిస్తున్నారు.
ఇన్నర్ హార్బర్ ఇప్పటికే సిద్ధమైందని, ఔటర్ హార్బర్ పనులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఏడు వేల టన్నుల అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గామి (ఎస్ఎస్బీఎన్- షిప్, సబ్మెర్సిబుల్, బాలిస్టిక్, న్యూక్లియర్) ‘ఐఎన్ఎస్ అరిధమన్’ ఈ ఏడాది జలప్రవేశం చేయనుంది. తన ముందు అణు జలాంతర్గాములైన ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ కంటే ఐఎన్ఎస్ అరిధమన్ కొంచెం పెద్దది. ఇది మరిన్ని కె-4 మధ్య శ్రేణి అణు క్షిపణులను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణులు 3,500 కిలోమీటర్ల రేంజిలోని లక్ష్యాలను ఛేదించగలవు. రూ.90 వేల కోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ (ఏటీవీ) ప్రాజెక్టులో భాగంగా ఈ మూడు మాత్రమే కాకుండా నాలుగో ఎస్ఎస్బీఎన్ నిర్మాణం కూడా త్వరలో మొదలు కావచ్చని అంటున్నారు.
-జమ్ముల శ్రీకాంత్
(Source: The Times of India, Business Standard, idrw.org)