
బనశంకరి: బెంగళూరు మహానగర పాలికెలో బోరుబావుల తవ్వకం, ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటు పథకంలో 2016–2019 మధ్య కోట్లాది రూపాయల అక్రమాల ఆరోపణలపై ఈడీ అధికారులు రెండవ రోజు బుధవారం కూడా తనిఖీలు కొనసాగించారు. పాలికె చీఫ్ ఇంజినీర్ బీఎన్.ప్రహ్లాద్‌రావ్ ఆఫీసులో సోదాలు చేశారు. బీబీఎంపీ చీఫ్ అకౌంటెంట్ బీనా ను విచారించారు. పాలికె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 8 వలయాల చీఫ్ ఇంజినీర్లను పాలికె ఆఫీసుకు పిలిపించి కూలంకుషంగా సమాచారం రాబట్టారు.
బొమ్మనహళ్లి, ఆర్‌ఆర్.నగర, మహదేవపుర, యలహంక, దాసరహళ్లి నియోజకవర్గాల్లోని 68 వార్డుల్లో 9,558 బోర్‌వెల్స్ తవ్వారు. దీంతో పాటు 976 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని బీబీఎంపీ అధికారులు లెక్కలు చూపారు. కానీ వెయ్యి బోర్లను తవ్వకుండానే తప్పుడు లెక్కలు చూపించి కోట్లాదిరూపాయల్ని కైంకర్యం చేశారని ఆరోపణలున్నాయి. మొత్తం రూ.400 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి.