
మోసగించిందని యువతిని హత్య చేసిన
భర్త మైసూరులో దారుణం
కర్ణాటక: సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమించిన వివాహితుడు, చివరకు ఆమెను చంపిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా బిళికెరె ఫిర్కా బూచనహళ్లి గ్రామంలో జరిగింది. తుమకూరుకు చెందిన పవిత్ర (26)ను ఆమె భర్త సచిన్ (26) హత్య చేశాడు. కొబ్బరి బోండాల వ్యాపారి సచిన్‌కు ఆరు నెలల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైన పవిత్ర తనకు ఎవరూ లేరని, తాను ఇన్ఫోసిస్‌లో టెక్కీనని చెప్పుకుంది. సచిన్‌కు అదివరకే పెళ్లయినా ఆమెతో ప్రేమాయణం నడిపాడు. చివరకు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో తాళికట్టాడు.
రోజూ ఆఫీసుకు డ్రాప్
సచిన్ ఆమెను మైసూరులోని ఇన్ఫోసిస్‌లో రోజూ డ్రాప్ చేసి వచ్చేవాడు. పవిత్ర పెద్దమ్మగా చెప్పుకున్న ఆమెకు సచిన్ ఫోన్ చేయగా, పవిత్ర ఎవరో తమకు తెలియదని చెప్పింది. ఆమె అన్నగా చెప్పుకున్న వ్యక్తితో మాట్లాడగా, పవిత్రకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని తెలిపాడు. ఆమె ఇన్ఫోసిస్ ఉద్యోగిని కాదని, ఆమె వద్ద ఉన్నది నకిలీ ఐడీ కార్డు అని తెలుసుకున్నాడు. తనను నమ్మించేందుకు ఉత్తుత్తిగా ఆఫీసుకు వెళ్తోందని తెలిసి రగిలిపోయాడు.
దీనిపై భార్యను ప్రశ్నించగా గొడవ జరిగింది. చివరకు బయట టిఫిన్ తిందాం రా అని భార్యను ఆటోలో తీసుకెళుతూ మార్గమధ్యంలో పొలంలోకి తీసుకెళ్లి పవిత్రకు తాడుతో గొంతు బిగించి చంపాడు. ఓ బాలుడు కూడా ఇందుకు సహకరించాడు. తరువాత సచిన్ బిళికెరె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థలాన్ని ఎస్పీ విష్ణువర్ధన్, ఏఎస్పీ మాలిక్, డీఎస్పీ గోపాలకృష్ణ, ఇన్‌స్పెక్టర్ లోలాక్షి చేరుకుని పరిశీలించారు. నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
భార్యను గొంతుకోసి హతమార్చిన భర్త
బొమ్మనహళ్లి: భార్యను నడిరోడ్డుపై చాకుతో గొంతు కోసి హత్య చేసిన భర్త ఉదంతం బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డతోగూరులో శుక్రవారం రాత్రి జరిగింది. ఆగ్నేయ విభాగం డీసీపీ సారా ఫాతిమా విలేకరులకు తెలియజేసిన వివరాలు.. బాగేపల్లికి చెందిన కృష్ణ, శారద (35) దంపతులు దొడ్డతోగూరులో ఉంటున్నారు. శారద పనికివెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. కృష్ణ మరో మహిళపై మోజులో పడ్డాడు.
ఈక్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. శుక్రవారం రాత్రి శారద పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రగతి నగరలో దారి కాచిన కృష్ణ రెండు చాకులతో దాడి చేశాడు. భార్యను కింద పడేసి గొంతు కోసి హత్య చేసి ఉడాయిస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుడు కృష్ణను అరెస్ట్ చేశారు. హత్యోదంతంపై విచారణ చేపట్టామన్నారు. దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర కలకలం ఏర్పడింది.