
ఔరంగాబాద్: విమానంలో ప్రయాణిస్తున్న ఒక వృద్దురాలు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో లాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి ముంబై నుండి వారణాసికి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) విమానంలో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. విమానంలో ప్రయాణిస్తున్న వృద్దురాలు సుశీలా దేవి(89) అస్వస్థతకు గురయ్యింది. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందినది. కొద్దిసేపటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. అక్కడికి సమీపంలోని చత్రపతి సంభాజీనగర్‌లోని చికల్థానా విమానాశ్రయం(ఔరంగాబాద్ విమానాశ్రయం, మహారాష్ట్ర)లో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విమానం ల్యాండ్ అయింది.
అక్కడికి చేరుకున్న వైద్య బృందం సుశీలా దేవిని పరీక్షించింది. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వారు నిర్ధారించారు. విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అస్వస్థతకు గురైనప్పుడు విమానం గాలిలో ఉంది. సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అత్యవసర ల్యాండింగ్(Emergency landing) తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు అవసరమైన చట్టపర ప్రక్రియలను పూర్తి చేశారు. అనంతరం ఆ ఇండిగో విమానం వారణాసి వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.
కాగా సుశీలా దేవి మృతదేహాన్ని చత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే సంబంధిత అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. గత నెలలో జైపూర్ నుండి చెన్నైకి వెళుతున్న విమానానికి సంబంధించిన టైర్ పేలిన ఘటన జరిగింది. అయితే ఈ ఉదంతంలో ఎవరూ గాయపడలేదు. ఈ రెండు సంఘటనలు విమాన ప్రయాణంలో భద్రత, అత్యవసర చర్యల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.
ఇది కూడా చదవండి: ‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్