బ్యాటర్‌కు ఉన్నంత  ఏకాగ్రత ఉండాలి  | PM Narendra Modi Hosts Pariksha Pe Charcha | Sakshi
Sakshi News home page

బ్యాటర్‌కు ఉన్నంత  ఏకాగ్రత ఉండాలి 

Published Tue, Feb 11 2025 5:11 AM | Last Updated on Tue, Feb 11 2025 5:11 AM

PM Narendra Modi Hosts Pariksha Pe Charcha

పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులతో మోదీ మాటామంతీ 

తోటలో కలియతిరుగుతూ చర్చా కార్యక్రమం 

న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షలపై ఉండే భయాలను పోగొడుతూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ ఆద్యంతం స్ఫూర్తివంతంగా సాగే ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం సోమవారం ఢిల్లీలో జరిగింది. 8వ ఎడిషన్‌లో భాగంగా ఈసారి కూడా ప్రధాని మోదీతో నేరుగా సంభాషించేందుకు కోట్లాది మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోగా కేవలం 35 మందికి మాత్రమే నేరుగా మాట్లాడే అవకాశం దక్కింది. 

ఢిల్లీలోని సుందర్‌ నర్సరీ వనంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు క్రికెట్‌ స్టేడియంలో బ్యాటర్‌లాగా ఎదుర్కోవాలి. తర్వాతి బంతికి ఫోర్‌ కొట్టు, సిక్స్‌ కొట్టు అంటూ వేలాది మంది ప్రేక్షకులు అరుస్తున్నా, ఈలలు వేస్తున్నా బ్యాటర్‌కు ఇవేం వినిపించవు. ఒక్క బంతి మీద మాత్రమే దృష్టిపెడతాడు. అంతటి ఏకాగ్రతను మీరూ సాధించండి. 

పరీక్షలు అనే ఒత్తిళ్లకు లొంగకుండా చదువు మీద మాత్రమే మీరు పూర్తిగా ధ్యాస పెట్టాలి. గత పరీక్షల ఫలితాల కంటే మెరుగైన మార్కులు తెచ్చుకుంటానని మీకు మీరే సవాల్‌ విసురుకోండి. పోషకాహారం తీసుకోండి. ధ్యానంపై దృష్టిపెట్టండి. జ్ఞానం, పరీక్షలు అనేవి భిన్నమైన అంశాలు. పరీక్షలే లోకంగా ఎప్పుడూ బతకొద్దు. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. సమయాన్ని ఎంత ఎక్కువగా సద్వినియోగం చేస్తారో జీవితంలో అంతపైకి ఎదుగుతారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోండి. సానుకూలతతో దేనినైనా సాధించవచ్చు’’అని మోదీ అన్నారు. ‘‘ఇటీవలికాలంలో సమాజంలో ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది.

 విద్యార్థులు పది, 12వ తరగతుల్లో సరిగా చదవక మార్కులు తక్కువొస్తే ఆ విద్యార్థి జీవితం నాశనమైనట్లేనని తల్లిదండ్రులు ఒక నిశ్చయానికి వచ్చేస్తున్నారు. విద్యార్థులేమీ రోబోట్లు కాదు. విద్య అనేది కేవలం తదుపరి తరగతికి అర్హత సాధించేందుకు ఉద్దేశించిందికాదు. విద్యార్థి సమగ్రాభివృద్ధికి విద్య ఒక సోపానం. తక్కువ గ్రేడ్‌లు వచి్చనప్పుడు సమాజం నుంచి విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఒత్తిళ్లను పక్కనబెట్టి విద్యార్థులు మిమ్మల్ని మీరు సవాల్‌గా తీసుకుని చదవండి. మంచిగా నిద్రపొండి. అత్యధిక స్కోర్‌ రాలేదంటే తమ పని అయిపోయిందనే ఆలోచనతో లోయలోకి విద్యార్థులు పడిపోవద్దు’’అని అన్నారు. ఆన్‌లైన్‌లో కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement