
న్యూఢిల్లీ: మహానగరం ముంబైలో 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన మాస్టర్‌మైండ్ తహవ్వూర్ రానా(Mastermind Tahavvoor Rana) నేడు (ఏప్రిల్ 9) భారత్‌కు చేరుకోనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలోని జైళ్లలో రహస్యంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో పేర్కొన్న వివరాల ప్రకారం అమెరికా న్యాయ వ్యవస్థ సిఫారసులకు అనుగుణంగా ఢిల్లీ, ముంబైలోని జైళ్లలో ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారని సమాచారం. తహవ్వూర్ రానా తొలుత కొన్ని వారాలపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency) (ఎన్ఐఏ) అదుపులో ఉండే అవకాశం ఉంది. ఈ ఏజెన్సీ కార్యకలాపాలను జాతీయ భద్రతా సలహాదారు ఎ.కె. దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. తహవ్వూర్ రానా పాకిస్తానీ-కెనడియన్ వ్యక్తి. లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ) సంస్థలో చురుకైన సభ్యుడు.
తహవ్వూర్ రానా తన సహచర ఉగ్రవాది, పాకిస్తానీ-అమెరికన్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ (అలియాస్ దావూద్ గిలానీ)కి పాస్‌పోర్ట్‌లు సమకూర్చాడు. హెడ్లీ భారత్‌లో తమ లక్ష్యాలను ఎంచుకునేందుకు ఈ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి దేశంలోకి ప్రవేశించాడు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఈ దాడులపై రానా సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు కారకులైన ఉగ్రవాదులకు వారి మరణానంతరం పాకిస్తాన్ అత్యున్నత సైనిక గౌరవాన్ని ఇవ్వాలని పేర్కొన్నాడు.
26/11 దాడుల్లో పాల్గొన్న లష్కర్ ఉగ్రవాది అజ్మల్ కసబ్(Ajmal Kasab)ను విచారణ అనంతరం 2012లో ఉరిశిక్ష అమలు చేశారు. గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉగ్రవాది తహవ్వూర్ రానా భారత్‌కు అప్పగింతను ధృవీకరించారు. ఈ అప్పగింత 2019 నుండి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా జరిగింది. 2019 డిసెంబర్‌లో భారత్.. అమెరికాను తహవ్వూర్ రానా అప్పగింత కోరింది. దీనితో అతని అప్పగింతకు మార్గం సుగమం అయింది. తహవ్వూర్ రానా భారత్‌కు చేరుకున్న తర్వాత అతనిని తీహార్ జైలులో ఉంచే అవకాశం ఉందని, అక్కడ ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ట్రంప్ సుంకాలపై భారత్- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు