
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక హమాస్ కుట్ర ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై తాజాగా రూవెన్ అజార్ స్పందిస్తూ..‘హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు మాకు సమాచారం ఉంది. పహల్గాంలో దాడికి వీటి మధ్య సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. గతంలో ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7, 2023 హమాస్ నరమేధానికి, పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూపత్య ఉంది. ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉన్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ముష్కరులు సంగీత కచేరీలో పాల్గొన్న 1,400 మందికి పైగా పౌరులను హత్య చేశారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకరించుకుంటున్నారు.. వారు ఒకరికొకరు అనుకరిస్తూ ఒకేలా మారుతున్నారు. ఈ ప్రమాదాలను ఎదుర్కొనడానికి నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలు, హెచ్చరికలు నాకు ఎంతో ధైర్యం కలిగించాయి. దోషులను వేటాడుతాం అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం అభినందనీయం. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులకు అనేక దేశాలు నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం, ఆయుధాల రూపంలో మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Watch: On the Pahalgam terror attack, Reuven Azar, Ambassador of Israel to India, says, "You have a similar situation in which people were going to a music festival and were massacred, and people here were going on vacation and they were massacred. It’s the same death cult, the… pic.twitter.com/5obbvzh89V
— IANS (@ians_india) April 24, 2025
ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న భారత్.. పాక్‌పై ముప్పేట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాక్‌కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగిరావాలని ఆదేశించింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. అటారీ-వాఘా సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో గురువారం రిట్రీట్ వేడుకను బీఎస్‌ఎఫ్ నామమాత్రంగా నిర్వహించింది. పాక్ గార్డులతో కరచాలనాన్ని రద్దు చేసింది. రిట్రీట్ సందర్భంగా సరిహద్దు గేట్లను తెరవలేదు. మిగిలిన అన్ని డ్రిల్స్‌ను యథావిధిగా నిర్వహించామని బీఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.