నేడు కశ్మీర్‌కు రాహుల్‌ గాంధీ | Congress MP Rahul Gandhi Visits Kashmir Pahalgam | Sakshi
Sakshi News home page

నేడు కశ్మీర్‌కు రాహుల్‌ గాంధీ

Published Fri, Apr 25 2025 7:19 AM | Last Updated on Fri, Apr 25 2025 7:19 AM

Congress MP Rahul Gandhi Visits Kashmir Pahalgam

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం జమ్ముకశ్మీర్‌ వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అనంతనాగ్‌ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో రాహుల్‌ మాట్లాడతారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరిగి వచ్చిన రాహుల్‌ గురువారం సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్నారని తెలిపాయి. అనంతరం అఖిల పక్ష సమావేశంలోనూ ఆయన పాలుపంచుకున్నారు.  

సీడబ్ల్యూసీ తీర్మానం.. మృతులకు ఘన నివాళి
ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది.

నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..
ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. అలాగే, లక్షలాది మంది పాల్గొనే అమర్‌నాథ్‌ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్‌ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’ అని కేంద్రానికి సూచించింది.

రాజకీయ ప్రయోజనాలొద్దు..
ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్‌ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్‌మార్చ్‌ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement