
పహల్గాం ఘటనకు పాకిస్తానే సూత్రధారి
సీడబ్ల్యూసీ తీర్మానం..మృతులకు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘‘ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది.
ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం’’ అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది. గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ అత్యవసర సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతోపాటు, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఒక క్షణం మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీడబ్ల్యూసీ, అనంతరం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..
ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్ర త కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’అని సీడబ్ల్యూసీ పేర్కొంది. ‘‘లక్షలాది మంది పాల్గొనే అమర్‌నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’’ అని కేంద్రానికి సూచించింది.
రాజకీయ ప్రయోజనాలొద్దు..
ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్‌మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.